రూ.5 కోట్లతో ఉడాయించిన వ్యాపారి

A businessman who made off with Rs.5 crores– బాధితుల ఆందోళన
నవతెలంగాణ-యాదగిరిగుట్ట
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని జైభవాని పాన్‌ బ్రోకర్స్‌ యజమాని మార్వాడి వ్యాపారి జితేందర్‌ సుమారు రూ.5 కోట్లతో ఉడాయించాడు. అవరసరం కోసం మార్వాడి వద్ద బంగారం కుదువ పెట్టి డబ్బులు తీసుకున్న వారు, అధిక వడ్డీకి ఆశపడిన ఆయనకు డబ్బులు ఇచ్చిన వారు లబోదిబోమంటున్నారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌కు చెందిన మార్వాడి వ్యాపారులు కొన్ని సంవత్సరాల కిందట గుట్టకు వచ్చి మొదటగా పాన్‌ బ్రోకర్‌ వ్యాపారం మొదలు పెట్టారు. కొన్ని నెలల తర్వాత వాళ్లకు సంబంధించిన వారిని కూడా పట్టణానికి తీసుకొచ్చి మరి కొన్ని షాపులు తెరిపించారు. అందులో ఒకరైన జితేందర్‌ సింగ్‌ పట్టణ ప్రజలకు ఎక్కువ వడ్డీ ఆశ చూపడంతోపాటు బంగారం కుదవ పెట్టుకొనేవాడు. ఈ క్రమంలో సుమారు రూ.5 కోట్ల వరకు బకాయిలతో రాత్రికి రాత్రే ఉడాయించాడు. దాంతో బాధితులు శుక్రవారం రాత్రి షాప్‌ వద్ద ఆందోళన నిర్వహించారు. పోలీసులు జోక్యం చేసుకొని వ్యాపారీ ఆచూకీ తెలుసుకుంటామని, బాధితులంతా వివరాలతో తమను సంప్రదించాలని సూచించారు. ఇదిలా ఉండగా, ఆ వ్యాపారి బంధువులైన దుర్గా పాన్‌ బ్రోకర్స్‌పై బాధితులు దాడి చేయబోగా పోలీసులు నియంత్రించి యజమానులను అదుపులోకి తీసుకున్నారు.

Spread the love