మ‌న‌సు దోచిన న‌టి

మ‌న‌సు దోచిన న‌టి‘ఆరేసుకో బోయి పారేసుకున్నాను’ అనే ఈ పాట ఒకప్పడు విపరీతమైన ప్రజాధరణ పొందింది. అయితే ఈ పాటలో నటించిన నటి పట్ల మాత్రం ఎందరో మనసు పారేసుకున్నారు. ఈ అందగత్తెతోనే రజనీకాంత్‌ ‘ఇంక ఊరేలా… సొంత ఇల్లెల ఓ చెల్లెలా’ అంటూ పాటపాడింది. ‘ఝుమ్మంది నాదాం… సై అంది పాదం’ అంటూ ఒక మూగ పాత్రలో నటించినా ఆమెకు ఆమే సాటి. ప్రతి ఒక్కరి మదిలో మెదిలే అద్భుత సౌందర్యరాసి. ఆమె నటించిన చిత్రాలు అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ అజరామరం.కొన్ని వందల సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి జయప్రద పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమె సినీ ప్రస్థానం మానవి పాఠకులకు ప్రత్యేకం…
రాజమండ్రికి చెందిన లలితా రాణి ‘భూమికోసం’ సినిమాలో మొట్ట మొదటి సారిగా అతి చిన్న పాత్రలో కనిపించారు. ఆనాడు అంత చిన్న పాత్రలో కనిపించిన లలితా రాణి తర్వాత కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ నటి జయప్రద. ఈమె రాజమండ్రికి చెందిన శ్రీకృష్ణ, నీలవేణి దంపతులకు జన్మించారు. భూమికోసం సినిమా తర్వాత ఆమె పేరును జయప్రదగా మార్చారు. తండ్రి సినీ రంగంలో ఫైనాన్షియర్‌గా పని చేస్తుండేవారు. జయప్రదకు చిన్నతనం నుండి సినిమాలపై మక్కువ ఉన్నప్పటికీ తల్లి ఆమెకు నాట్య, సంగీతంలో శిక్షణ ఇప్పించారు.
అతి చిన్న పాత్రలో…
జయప్రద ఒక రోజు నాట్యం చేస్తుండగా ప్రముఖ నటుడు ప్రభాకర్‌ రెడ్డి చూసి చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. జయప్రద చిన్నతనంలో డాక్టర్‌ కావాలని అనుకున్నారు. కానీ అనుకోకుండా అవకాశం రావడంతో నటిగా మారిపోయారు. భూమి కోసంలో అతి చిన్న నిడివి గల పాత్ర వేసినప్పటికి అదే ఆమెకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత సినిమా అవకాశాలు వెల్లువలా వచ్చిపడ్డాయి. తెలుగు, హిందీ, తమిళ్‌, మలయాళం, కన్నడ, బెంగాలీ భాషల్లో నటిస్తూ క్షణం తీరుబడి లేకుండా ఉండేవారు. దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించారు.
అందం అంటే జయప్రద
ఆమె పెదవిపై పుట్టుమచ్చ ప్రత్యేక ఆకర్షణ. అప్పట్లో పెండ్లి కావల్సిన మగవాళ్ళందరూ ఆమెలాంటి అందగత్తె భార్యగా కావాలని కోరుకునేవారంట. సత్యజిత్‌ రే వంటి ప్రముఖులు జయప్రద అంతటి అందగత్తె ప్రపంచంలోనే లేదని ప్రశంసించారు. తెలుగులోనే కాక హిందీలో కూడా నెంబర్‌వన్‌గా స్థానం సంపాదించుకున్నారు. అమితాబ్‌ బచ్చన్‌, జితేంద్ర వంటి హీరోలతో నటించి హిట్‌ పెయిర్‌గా పేరు తెచుకున్నారు. ‘అంతులేని కథ’ సినిమాలో ఒక మధ్య తరగతి కుటుంబ భారాన్ని మోసే కూతురిగా, తన కలలన్నీ చిదేముసుకుని కుటుంబం కోసమే తన జీవితాన్ని త్యాగం చేసిన ఒక సగటు ఆడపిల్లగా జయప్రద చాలా అద్భుతంగా నటించారు. ఆ సినిమాలో నటించినప్పుడు ఆమె వయసు చాలా తక్కువ.
తిరుగులేని నటిగా…
‘సిరిసిరి మువ్వ’ సినిమాలో మూగ పాత్రలో నటించారు అనడం కంటే జీవించారు అని చెప్పవచ్చు. కె.విశ్వనాధ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డ్‌ దక్కింది. ఇదే సినిమాని హిందీలో ‘సర్‌ గం’ పేరుతో నిర్మించారు. అక్కడ కూడా తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయి, తిరుగులేని నటిగా ఎన్నో అవకాశాలు పొందారు. ‘అగ్నిపూలు’ చిత్రంలో వీల్‌ చైర్‌కే పరిమితమైన ఆమె పాత్ర బిడ్డకి, భర్తకి ఒక తల్లిగా, భార్యగా తాను నిర్వర్తించవలసిన బాధ్యతలకు న్యాయం చేయలేక పోతున్నందుకు ఆమె పడిన మానసిక క్షోభ ప్రేక్షకుల హృదయాలని కదిలించింది. ‘చండిప్రియ’లో అహంభావిగా, ‘భద్రకాళి’లో మతి స్థిమితం కోల్పోయి పిచ్చిదానిలా కనిపించిన జయప్రద నటనను ఎవరు మరువలేదు.
ఓర్పుకు ప్రతిరూపంగా…
‘గిరిజా కల్యాణం’ చిత్రంలో ఆర్ధిక ఇబ్బందులతో తమ్ముడికి వైద్యం చేయించలేక బాధపడుతుంటుంది. అనుకోకుండా ఒక ధనవంతుడు పరిచయమవుతాడు. అతనికి గిరిజ బాగా నచ్చుతుంది. దారి తప్పిన తన మనవడిని మంచి మార్గంలోకి తెగల సమర్థురాలు ఆమేనని గ్రహించి గిరిజని ఒప్పించి తన మనవడికి ఇచ్చి పెండ్లి చేస్తాడు. భర్త ప్రవర్తనతో మనసు గాయపడి అతనికి దూరంగా ఉంటుంది. దాంతో పెద్దవాళ్ళు కొన్ని షరతులు విధించి కొన్నాళ్ళు ఇద్దరినీ కలిసి ఉండమని చెబుతారు. ఆ సమయంలో జయ ప్రద, గిరిజ పాత్రలో ఒదిగిపోయి ఎంతో సహనంతో భర్తలో మార్పు తీసుకొస్తుంది. ఇందులో జయప్రద నటన చూసి ఓర్పు, సహనంతో ఒక మనిషిని ఎలా మార్చవచ్చు అనే సందేశం ప్రేక్షకుల్లోకి వెళుతుంది.
అనేక పురస్కారాలు…
అక్కినేని, రామారావు, శోభన్‌ బాబు, కృష్ణ, కృష్ణంరాజు వంటి మహా నటుల పక్కన నటించే అవకాశం కలిగిందంటే అది ఆమె నటనా సామర్ధ్యం వల్లనే అని చెప్పవచ్చు. సినిమాల్లోనే కాక రాజకీయ రంగంలోనూ తనదైన ముద్రవేసుకున్నారు. వివాద రహితురాలిగా పేరుతెచ్చుకున్నారు. ఆమె నటనకుగాను అనేక పురస్కరాలు అందుకున్నారు. ఉత్తమ నటిగా నాలుగు సార్లు ఫిలింఫేర్‌ అవార్డును అందుకున్నారు. అలాగే కళా సరస్వతి అవార్డు, నర్గీస్‌ దత్‌ బంగారు పతకం, శకుంతల రామన్‌ అవార్డు, ఉగాది పురస్కరాలతో పాటు మరెన్నో పురస్కారాలు ఆమె జాబితాలో చేరాయి.
ప్రేక్షకుల మెప్పు పొందారు
విశ్వనాధ్‌, కె.బాలచందర్‌, రాఘవేంద్ర రావు, దాసరి నారాయణ రావు, కె.ఎస్‌.ఆర్‌. దాస్‌, నందమూరి తారకరామారావు వంటి మహామహుల దర్శకత్వంలో నటించిన ఘనత ఆమెకే దక్కింది. ఒక్క సాఘింక చిత్రాలలోనే కాక, పౌరాణిక, చారిత్రాత్మక చిత్రాలలో కూడా నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు. సాగరసంగమం, ముందడుగు, ఈనాటి బంధం ఏనాటిదో, శ్రీ రాజ రాజేశ్వరి విలాస్‌ కాఫీ క్లబ్‌, కురుక్షేత్రం, యమగోల, నాయుడు బావ మొదలైన చిత్రాలలో ఆమె నటన చిరస్థాయిగా నిలిచిపోయింది.
– పాలపర్తి సంధ్యారాణి

Spread the love