ఎన్నిసార్లు చూసినా.. కొత్తగా ఉండే సినిమా

సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న పాన్‌ ఇండియా మిస్టీక్‌ థ్రిల్లర్‌ ‘విరూపాక్ష’. సంయుక్తమీనన్‌ కథానాయిక. కార్తీక్‌ దండు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్స్‌పై బాపినీడు బి.సమర్పణలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుకుమార్‌ ఈ చిత్రానికి స్క్రీన్‌ ప్లే అందించారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈనెల 21న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్‌ అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఏలూరులోని సీఆర్‌ రెడ్డి కాలేజ్‌ గ్రౌండ్‌లో నిర్వహించారు.
ఈ సందర్భంగా సాయి ధరమ్‌ తేజ్‌ మాట్లాడుతూ,’ ఈనెల 21న రాబోతున్న ఈ సినిమా కచ్చితంగా హిట్‌ అవుతుంది. మిమ్మల్ని అలరించాలని ఈ సినిమా చేశాం. తేజ్‌ నీ కోసం మంచి కథ పంపిస్తాను విను అని సుకుమార్‌ అన్నారు. మంచి లవ్‌ స్టోరీ పంపిస్తారని అనుకున్నాను. కానీ భయపెట్టే కథను పంపించారు. అసలే హర్రర్‌ సినిమా అంటే నాకు భయం. అద్భుతంగా నెరెట్‌ చేశాడు కార్తిక్‌. అలాగే సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. మా నిర్మాతలు నాకు అండగా నిలబడ్డారు. శ్యాం లైటింగ్‌ అద్భుతంగా ఉంది. ఆర్ట్‌ డైరెక్టర్‌ నాగేంద్ర సెట్‌లు చూస్తే ఆడియెన్స్‌ భయపడతారు. అజనీష్‌ ఆర్‌ఆర్‌ అద్భుతంగా ఉంది’ అని తెలిపారు.
‘దర్శకుడు కార్తీక్‌ లైఫ్‌ చాలా క్రిటికల్‌ కండీషన్‌లో నా వద్దకు వచ్చాడు. మెడికల్‌ ప్రాబ్లం నుంచి బయట పడి.. ఈ సినిమాను డైరెక్ట్‌ చేశాడు. స్టెరాయిడ్స్‌ ఎక్కితే గానీ కార్తీక్‌ ప్లేట్‌ లెట్స్‌ పెరగవు. అయినప్పటికీ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ సినిమా పెద్ద హిట్‌ అవ్వాలి. ఇండిస్టీలో మంచి దర్శకుడు అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా తేజ్‌కి నటుడిగానూ పునర్జన్మలాంటిది’ అని దర్శకుడు సుకుమార్‌ అన్నారు. నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ, ‘ఇదే గ్రౌండ్‌లో ఆటలు ఆడాం. నేను ఇక్కడే చదువుకున్నాను. సుకుమార్‌తో కలిసి ఈ సినిమాను నిర్మించడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో ప్రతీ ఒక్కరూ అద్భుతంగా నటించారు. ఇది మంచి చిత్రం అవుతుంది’ అని చెప్పారు. డైరెక్టర్‌ కార్తిక్‌ దండు మాట్లాడుతూ, ‘ఎన్టీఆర్‌ వాయిస్‌ వల్ల ఈ సినిమాకు పవర్‌ వచ్చింది. సినిమా టీజర్‌ను చూసి పవర్‌ స్టార్‌ మెచ్చుకున్నారు. సుకుమార్‌ ఈ కథ విని.. స్క్రీన్‌ ప్లే చేస్తాను, ప్రొడ్యూస్‌ చేస్తాను అని అన్నారు. అయితే ఇంకా పెద్ద స్థాయిలో సినిమాను తీయాలని బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌కి చెప్పారు. సాయితేజ్‌కి ఈ సినిమా కెరీర్‌ పాథ్‌ బ్రేకింగ్‌ సినిమా అవుతుంది. ఈ సినిమాను ఇంత గొప్పగా నిర్మించిన బాపీ, ప్రసాద్‌కి థ్యాంక్స్‌. ఇందులో నటీనటులు కాకుండా నేను సృష్టించిన పాత్రలే కనిపిస్తాయి. నాకు హర్రర్‌ సినిమాలంటే ఇష్టం. నేను ఈ సినిమాతో హర్రర్‌ జోనర్‌ రుణం తీర్చుకున్నాను’ అని తెలిపారు.

Spread the love