కొత్త పాస్‌పోర్టు

కోసం రాహుల్‌ పిటీషన్‌
న్యూఢిల్లీ : మరికొద్ది రోజుల్లో అమెరికా పర్యటనకు సిద్ధమవుతున్న కాంగ్రెస్‌ నాయకులు రాహుల్‌ గాంధీ కొత్త పాస్‌పోర్టు కోసం కోర్టును ఆశ్రయించారు. ‘సాధారణ పాస్‌పోర్టు’ను పొందేందుకు నిరభ్యంతర పత్రాన్ని ఇవ్వాలంటూ బుధవారం ఢిల్లీలోని మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఈ నెల 26 (శుక్రవారం)న విచారణ జరపనున్నట్లు న్యాయస్థానం తెలిపింది.’మోదీ ఇంటిపేరు’ వ్యాఖ్యల కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడటంతో రాహుల్‌ పై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. దీంతో ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దయ్యింది. ఫలితంగా రాహుల్‌ తన దౌత్య పాస్‌పోర్టు సహా అన్ని రకాల ప్రయాణ పత్రాలను సంబంధిత అధికారులు సమర్పించారు. అలాగే, నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో రాహుల్‌ నిందితుడిగా ఉన్నారు. దీంతో కొత్తగా సాధారణ పాస్‌పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం.. శుక్రవారం విచారణ చేపడతామని తెలిపింది. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో రాహుల్‌ గాంధీతో పాటు మరికొందరికి 2015 డిసెంబరు 19న ఢిల్లీ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. రాహుల్‌ గాంధీ ఈ నెల 31 నుంచి పది రోజులపాటు అమెరికాలో పర్యటించనున్నట్లు కాంగ్రెస్‌ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. జూన్‌ 4న న్యూయార్క్‌లోని మాడిసన్‌ స్క్వేర్‌ గార్డెన్‌లో ఏర్పాటు చేసే బహిరంగ సభతో పాటు వాషింగ్టన్‌, కాలిఫోర్నియాలోని పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

 

Spread the love