చైనాలో కొత్త వైరస్‌ కలకలం !

A new virus in China Confusion!– నిశితంగా పర్యవేక్షిస్తున్నామన్న కేంద్రం
బీజింగ్‌ : చైనాలో కొత్త వైరస్‌ కలకలం సృష్టిస్తోంది. కొత్త రకమైన ఇన్ఫెక్షన్‌ దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందుతోందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆస్పత్రులన్నీ రోగులతో కిక్కిరిసి పోతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి కానీ చైనా లేదా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంతవరకు ఈ వార్తలను ధృవీకరించలేదు. ఈ వైరస్‌ను ‘మెటా న్యుమో వైరస్‌’ (ఎంవిపి) గా పిలుస్తున్నారు. ఈ వైరస్‌ను 2001లోనే గుర్తించారని అంటున్నారు. వందలాదిమందికి దీని బారిన పడ్డారని తెలుస్తోంది. చాలామంది జలుబు, దగ్గు, శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులుతో బాధపడుతున్నారు. ఈ వైరస్‌ లక్షణాలుగా వీటిని భావిస్తున్నారు. ఉత్తర చైనాలో ఈ ఇన్‌ఫెక్షన్‌ ఎక్కువగా వుంది. ఈ నేపథ్యంలో చైనాలో పరిస్థితులపై ఆసియా దేశాలు దృష్టి సారించాయి. కరోనాకు ఎలాంటి లక్షణాలైతే వున్నాయో ఆలాంటి లక్షణాలే ఈ వైరస్‌లో కూడా కనిపిస్తున్నాయని, రోగ నిరోధక శక్తి వున్నవారు ఎక్కువగా వీటి బారిన పడే అవకాశం వుందని డాక్టర్లు చెబుతున్నారు. డిసెంబరు 16నుండి 22 వరకు ఈ వారంలో అంటువ్యాధుల బారిన పడిన వారి సంఖ్య కూడా భారీగానే వుందని మీడియా వార్తలు పేర్కొంటున్నాయి. చైనాలో వైరస్‌ వార్తలను నిశితంగా పరిశీలిస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. చైనాలో శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడేవారి సంఖ్య పెరిగినట్లు తెలుస్తోందని అన్నారు. 14ఏళ్ళలోపు వయస్సు గల పిల్లల్లో హ్యూమన్‌ మెటా న్యుమోవైరస్‌ (హెచ్‌ఎంవిపి) కేసులు పెరిగాయి. అంతర్జాతీయ సంస్థలతో దీనిపై నిరంతరంగా మాట్లాడుతున్నట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (ఎన్‌సిడిసి) అధికారి ఒకరు తెలిపారు. భారత్‌లో ఇప్పటివరకు ఇలాంటి కేసులేవీ లేవని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ అతుల్‌ గోయల్‌ విలేకర్లకు చెప్పారు.

Spread the love