బాధను అన్వేషిస్తున్న చిత్రకారిణి

కవిత్వం వలె చిత్రం కూడా ఎన్నో భావాలను పలికిస్తుంది. మరెందరినో కదిలిస్తుంది. మనల్ని చైతన్య పరుస్తుంది. అదే చిత్రకారుల్లోని మనసులోతుల్లోని ఆలోచనలను కాన్వాస్‌పై ఆవిష్కరించేలా ప్రేరేపిస్తుంది. కాదేదీ కవితకనర్హం అని శ్రీశ్రీ అన్నట్టు కాదేదీ కళకు అనర్హం అంటూ తమ ప్రతిభను చాటుకుంటున్న వారు ఎందరో మన కండ్ల ముందు ఉన్నారు. వారిలో ఆర్టిస్ట్‌ సుకన్య గార్గ్‌ కూడా ఒకరు. మనిaి శరీరమే ఆమె ఓచిత్రకళకు కథా వస్తువు. చిన్న గాయమయితే చాలు అంత పెద్ద శరీరం నొప్పితో విలవిలలాడిపోతుంది. అసలు శరీరానికి బాధ ఎక్కడి నుండaaి వస్తుంది అంటూ aతన కళ ద్వారా నొప్పిని, చిక్కులను అన్వేషిస్తున్న ఆమె పరిచయం నేటి మానవిలో…
    ముంబైకి చెందిన చిత్రకారిణి సుకన్య గార్గ్‌ శరీర నొప్పిని, వైద్యంలోని విభిన్న పద్ధతులను అర్థం చేసుకోవడానికి తన చిత్ర కళను ఉపయోగిస్తుంది. ఆమె తన కళలో మానవ శరీర చిక్కులను సైతం అన్వేషిస్తుంది. దీని కోసమే చిత్రాలను గీస్తున్నది. ఆమె రచనల దృశ్య సౌందర్యం మానవ కణం రూపం నుండి ప్రేరణ పొందింది. ”మన శరీరంలో 37 ట్రిలియన్లకు పైగా జీవకణాలు ఉన్నాయని జీవ శాస్త్రం చెబుతుంది. ఈ కణాలలో ప్రతి ఒక్కటి దాదాపు ఒకేలా కనిపిస్తున్నప్పటికీ, వాటి పనితీరు వంశపారంపర్యంగా, మన వ్యక్తిగత అనుభవాలతో నిరంతరంగా మారుతుంటాయి. మన శరీరం ఇన్ని మార్పులకు గురవుతుంది కాబట్టే నా పెయింటింగ్‌లు మన అనుభవాలు, భావోద్వేగాలతో విభజింపబడే శరీరం, ఈ అనంతమైన సెల్యులార్‌ రూపాల నుండి ప్రేరణ పొందాయి” అంటుంది సుకన్య.
ప్రశ్నలు ఎదుర్కొంటున్నా…
ఒక కళాకారిణిగా సుకన్యకు ఆసక్తి కలిగించే విషయం ఏమిటంటే గాయాలు అయినపుడు కొన్నిసార్లు మన శరీరంపై మచ్చలు ఏర్పడతాయి, కానీ కొన్నిసార్లు అసలు గాయం అయినట్టే తెలియదు. యుఎస్‌ఏలోని డ్యూక్‌ యూనివర్శిటీ నుండి పబ్లిక్‌ పాలసీ గ్రాడ్యుయేట్‌ చేసిన సుకన్య ”మన జీవశాస్త్రం భౌతిక విషయాలను మాత్రమే కాకుండా వాటిపై అవగాహనలను కూడా పెంచుతుంది. అయితే వైద్య ప్రమాణాల ఆధారంగా అనారోగ్యాలను నిర్ధారించడానికి చేస్తున్న నా పని కొంత వివక్షతను, కొన్ని ప్రశ్నలను ఎదుర్కుంటోంది. రోగనిర్ధారణకు ఇటువంటి పాత పద్ధతులను నేటి పరిస్థితుల్లో చాలామంది అంగీకరించరనేది వాస్తం. ఎందుకే ఇలాంటి వైద్యం కంటికి కనిపించదు. అందుకే నేను అవగాహన కల్పించాలని ప్రయత్నిస్తున్నాను” అని ఆమె అంటున్నారు.
తొందరపడొద్దు
ప్రముఖ చిత్రకారిణి శోభా బ్రూటా వద్ద సుకన్య శిక్షణ పొందింది. ఢిల్లీలోని ధూమిమల్‌ గ్యాలరీ నుండి విజువల్‌ ఆర్ట్‌ రంగంలో రవి జైన్‌ మెమోరియల్‌ వార్షిక ఫెలోషిప్‌ అవార్డు 2021ని అందుకుంది. అంతే కాదు అనేక ఇతర అవార్డులకు నామినేట్‌ చేయబడింది. ఆమె పెయింటింగ్స్‌ న్యూఢిల్లీ, ముంబై, కోల్‌కతా, ఖాట్మండు, బెర్లిన్‌, విల్నియస్‌లోని గ్యాలరీలలో ప్రదర్శించబడ్డాయి. జపాన్‌కు చెందిన మోటోరు యమమోటో అనే కళాకారుని ప్రభావం సుకన్యపై తీవ్రంగా ఉంది. దీనికి తోడు ఆమె శిక్షకురాలు శోభ సలహాలు కూడా ఆమెకు అండగా నిలిచాయి. ”ఏ విషయంలోనూ తొందరపడొద్దు. సమయం ఇవ్వాలని, ఎక్కడా రాజీపడవద్దు. నీ సొంత వ్యక్తిగత కళకు ప్రామాణికంగా ఉండటం మీ ఎదుగుదలకు అవసరం అని నా గురువైన శోభా ఎప్పుడూ చెబుతుంటారు” ఆమె పంచుకున్నారు. అందుకే కొత్తగా చిత్రకళను ప్రారంభించిన కళాకారులందరికీ సుకన్య ఇచ్చే సూచన ఏమిటంటే ‘ఎదుగుదల విషయంలో తొందరపడవద్దు. ఓర్పుగా ఉండటమే మన ప్రయాణంలో ఒక ముందడుగు’ అంటుంది.
చిత్రం తృప్తినివ్వనపుడు…
సుకన్య తన జీవితంలో రోజువారీ జరిగే చర్యల ద్వారా ప్రేరణ పొందింది. ఆమె తరచుగా ప్రకృతి, ప్రత్యేకించి దాని రేఖాగణిత నమూనాలు, భౌగోళిక భూభాగాలలతో ప్రేరణను పొందుతుంది. ఆమె వైద్య, సాహిత్యం, శాస్త్రీయ విషయాల పట్ల కూడా ఆకర్షితురాలైంది. అవి మానవ అనుభవాలు, కథలను రూపొందించడానికి సహాయపడతాయని ఆమె నమ్ముతుంది. తాను గీసిన చిత్ర తనకు తృప్తినివ్వనపుడు ఆమె కవిత్వానికి తిరిగి వస్తుంది. తనలోని సృజనాత్మకతకు మరింత మెరుగులు దిద్దేందుకు, తన మార్గం సుగమం చేసుకునేందుకు ఓదార్పు కోసం కవిత్వం వైపు చూస్తుంది.

Spread the love