– విభజన సమస్యలపై తెలుగు రాష్ట్రాల సీఎస్‌ల భేటీ
– మూడు అంశాలపై అంగీకారం
– డ్రగ్స్ నియంత్రణకు సంయుక్త కమిటీ
– కరెంటు బకాయిలపై మరోసారి కూర్చుందాం : సీఎస్‌ల నిర్ణయం
అమరావతి: రాష్ట్ర పునర్ విభజన అంశాల పరిష్కారంలో భాగంగా ఏపీ, తెలంగాణ సీఎస్‌ల నేతృత్వంలోని అధికారుల బృందం సోమవారం మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో భేటీ అయ్యింది. రెండు రాష్ట్రాల పెండింగ్ సమస్యలు గురించి సుమారు రెండు గంటల పాటు సమావేశంలో చర్చించారు. ఈ ఏడాది జులై 5న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిలు హైదరాబాద్‌లోని ప్రజావేదికలో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీకి కొనసాగింపుగా ఇరు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు మంగళగిరిలో నేడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు సీఎస్‌లు మూడు అంశాలపై అంగీకారానికి వచ్చినట్టు తెలిసింది. విద్యుత్తు బకాయిలు అంశం ఎటూ తేలలేదని సమాచారం. రూ.861 కోట్ల మేర లేబర్ సెస్‌ను ఎపి, తెలంగాణ మధ్య పంపకానికి అంగీకారం కుదిరింది. పన్నులు పంపకాలపై ఇరు రాష్ట్రాల శాఖాధికారుల సమావేశమై ఓ నిర్ణయానికి రావాలని నిర్ణయించారు. 9,10 షెడ్యూల్ సంస్దల ఆస్తులు, అప్పులు పంపకాల అంశమూ తేలలేదు. ఉద్యోగుల మార్పిడిపైనా సీఎస్‌ల కమిటీ సమావేశంలో సుదీర్ఘచర్చ జరిగింది. ఎక్సైజ్ శాఖకు తెలంగాణ చెల్లించిన రూ.81కోట్ల బకాయిల అంశం పరిష్కారమైంది. అదనంగా ఇచ్చిన రూ.81కోట్లు తిరిగి చెల్లించినట్టు ఏపీ తెలిపింది. డ్రగ్స్ నివారణపై సంయుక్త కమిటీ వేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఇందుకోసం పోలీస్, ఎక్సైజ్ శాఖలతో సంయుక్త కమిటీ వేయాలని నిర్ణయానికి వచ్చారు. మరో రెండు అంశాలపై సీఎస్‌ల కమిటీలో ఏకాభిప్రాయం కుదిరినట్టు సమాచారం, విభజన అంశాలపై చర్చించేందుకు మరోసారి భేటీ కావాలని సిఎస్‌లు నిర్ణయించారు. ఈ కీలక భేటీలో ఏపీ నుంచి సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్‌తోపాటు ఆర్ధిక శాఖ కార్యదర్శి, హోమ్‌శాఖ కార్యదర్శి, ఎక్సైజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి, జెన్‌కో సీఎండీ, వాణిజ్యపన్నులశాఖ చీఫ్ కమిషనరు హాజరయ్యారు. తెలంగాణ నుంచి సిఎస్ శాంతకుమారితో పాటు ఆర్దిక, హోమ్‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు.