డంపింగ్‌ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం

డంపింగ్‌ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం– త్వరలోనే తరలింపునకు చర్యలు : స్టేషన్‌ ఘనపూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
– రాంపూర్‌ గ్రామంలో పర్యటన
నవతెలంగాణ-ఎన్జీవోస్‌ కాలనీ
రాంపూర్‌లోని డంపింగ్‌ యార్డు సమస్యను త్వరలోనే పరిష్కరిస్తానని స్టేషన్‌ ఘనపూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ఈ సమస్యను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని తెలిపారు. హన్మకొండ జిల్లా రాంపూర్‌ గ్రామంలో శుక్రవారం ఎమ్మెల్యే పర్యటించి పలు సమస్యలపై ప్రజలతో చర్చించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ.. వరంగల్‌-కరీంనగర్‌ పట్టణానికి మధ్యలో ఉన్న నేషనల్‌ హైవే సమీపంలో 100 ఎకరాల స్థలాన్ని గుర్తించి ఈ డంపింగ్‌ యార్డును తరలించేందుకు ప్రయత్నాలు మొదలవుతున్నాయని చెప్పారు. రాంపూర్‌కు వచ్చే ప్రధాన రహదారిపై భారీ వర్షాల కారణంగా నీరు నిలిచిపోతున్నాయని, ఇంజనీరింగ్‌ అధికారులను పంపించి కాజ్‌ వే లేదా బ్రిడ్జి ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు.
రాంపూర్‌లో రెండు శ్మశానవాటికలను ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామంలోని ప్రభుత్వ భూముల్లో ఇష్టానుసారంగా గుడిసెలు వేసుకుని ఆక్రమించుకోకుండా చూస్తానని, త్వరలోనే తహసీల్దార్‌ని పంపించి అర్హులైన వారికి ఇండ్ల స్థలాల పట్టాలు ఇస్తామని తెలిపారు. కార్పొరేషన్‌ అధికారులతో మాట్లాడి మిషన్‌ భగీరథ మంచినీటి సమస్య పరిష్కరిస్తారన్నారు. త్వరలో మున్సిపల్‌, ఇంజనీరింగ్‌, రెవెన్యూ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలన్నీ పరిష్కరించే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love