నిరంతర శ్రామికుడు సౌమ్యుడు..

– తాత 100 ఎకరాల భూస్వామి
– తండ్రి రజాకార్లను ఎదిరించిన ధీరుడు
– శ్రామిక పక్షపాతి తాళ్లూరి కృష్ణమూర్తి
నవతెలంగాణ-మణుగూరు
తాళ్లూరు కృష్ణమూర్తి తాత నరసయ్య 100 ఎకరాల భూస్వామి. ఉమ్మడి కుటుంబం. కృష్ణమూర్తి తండ్రి కోటయ్య, ఆయన తోబుట్టువులు తాళ్లూరి కోదండరామయ్య, కాంతయ్య. ఏన్కూరు మండలం పోరాటాల గడ్డ ఉద్యమాలకు పుట్టినిల్లు లచ్చగూడెం గ్రామంలో తాళ్లూరు కోటయ్య అన్నపూర్ణమల రెండవ సంతానం కృష్ణమూర్తి. ఆయన తోడ ఒక అక్క, నలుగురు చెల్లెలు ఉన్నారు. భార్య సంధ్యారాణి. తన పెదనాన్న కోదండ రామయ్య జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని తన కుమారులకు రాము, రఘు పేరు పెట్టుకున్న ఆదర్శమూర్తి కృష్ణమూర్తి. ఉన్నత చదువుల అనంతరం వివిధ ఉద్యోగాలలో స్థిరపడ్డారు.
కృష్ణమూర్తి తండ్రి కోటయ్య స్వతంత్ర సమరయోధులు. రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటాలలో పాల్గొన్నారు. అనేకసార్లు నిర్బంధాలకు గురయ్యారు. గుల్బర్గా జాల్నాలలో జైలు జీవితం అనుభవించారు. తాత ద్వారా సంక్రమించిన ఆస్తి 30 ఎకరాలు పేద ప్రజలకు తండ్రి కోటయ్య పంచించాడు. కోటయ్య నాన్న జైలు జీవితం అనుభవిస్తున్న సమయంలో కుటుంబ ఆర్థిక భారం అంతా కృష్ణమూర్తి భుజస్కందాలపై పడింది. అనేక కష్టాలు ఎదుర్కొని మధిరలో సిరిపురం కాలేజీలో ఇంటర్‌ పూర్తి చేశాడు. పాల్వంచలో జీవనం కొనసాగిస్తూనే సింగరేణిలో ఉద్యోగం సంపాదించాడు. తన తోబుట్టువులైన ఆడపిల్లలు అందరికీ పెళ్లిళ్లు చేశాడు. కోల్డ్‌ ఫిల్లర్‌గా ప్రారంభమైన సింగరేణి ప్రస్థానం మైనింగ్‌ సర్దార్‌ వరకు కొనసాగింది. సింగరేణిలో కార్మిక పక్షపాతిగా సౌమ్యుడిగా కార్మికులచే అధికారులచే ప్రశంసలు పొందారు. కృష్ణమూర్తి పెదనాన్నలు కోదండరామయ్య, కాంతయ్యలు రజాకార్లకు ఎదిరించిన ధీరత్వం వారిది.
తాళ్లూరి కోదండరామయ్య, చండ్ర పుల్లారెడ్డి నాయకత్వంలో వీర తెలంగాణ రైతాంగ పోరాటంలో దళాలకు నాయకత్వం వహించారు. 12 గ్రామాలలో భూస్వాములకు వ్యతిరేకంగా కూలిపోరాటలు నిర్వహించారు. దళ కమాండర్‌గా నాయకత్వం వహించాడు. తన కూతురు తులసమ్మ ఆరోగ్యం బాగోలేదని తెలుసుకున్న కోదండరామయ్య మారువేషంలో లచ్చు గూడెం నుండి ఏన్కూర్‌ వస్తుండగా మార్గమధ్యంలో కాంగ్రెస్‌ భూస్వామి వర్గం గుర్తించారు. ఆ ముష్కరులు కోదండ రామయ్యను బంధించి చెట్టుకు కట్టేసి రాళ్లు, కర్రలతో హింసించి లింగన్నపేటలో హత్య చేశారు. ఆ మరణ వార్త ఆ ప్రాంతంలో విషాదాన్ని నింపింది. అనేక గ్రామాలలో ప్రజలు ప్రభుత్వ యంత్రాంగం మరియు పోలీసులు కోదండరామయ్య గొప్పతనాన్ని కీర్తించారు. కోదండరామయ్య హత్యను నిరసించినారు. కోదండ రామయ్య కూతురే తులసమ్మ. నేటి మణుగూరు వైస్‌ ఎంపీపీ కరివేద వెంకటేశ్వరరావు (కె.వి.రావు) మాతృమూర్తి. కెవి రావు కృష్ణమూర్తి స్వయాన మేనమామ. తనను ఏడో తరగతి నుంచి ఇంటర్‌ వరకు చదివించి, మణుగూరులో స్థిరపడేందుకు ఆయన సహకారం అందించారన్నారు.

Spread the love