కాళేశ్వరాన్ని బద్నాం చేసే చిల్లర ఆలోచన

కాళేశ్వరాన్ని బద్నాం చేసే చిల్లర ఆలోచన– కాంగ్రెస్‌ కుట్రంలో భాగంగా సుందిళ్ల, అన్నారం ఖాళీ
– ఎన్డీఎస్‌ఎ నుంచి అనుమతి తీసుకోలేదు : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కాంగ్రెస్‌ ప్రభుత్వానిది కాళేశ్వరం ను బద్నాం చేసే చిల్లర ఆలోచన అని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. ఈ కుట్రలో భాగంగా గత యాసంగిలో నీళ్లు కనిపించినా, ఇవ్వకపోతే రైతుల్లో బద్నాం అవుతామని రాష్ట్ర ప్రభుత్వం ఖాళీ చేసిందని ఆరోపించారు. అంతేకానీ అన్నారం, సుందిళ్ల బ్యారెజ్‌ లు తెగిపోయినవి కాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కు ఏమో అయిందని, రైతుల్ని మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజకీయ దురుద్దేశంతో కరువుకు గురిచేస్తూ లక్షలాది ఎకరాల్ని ఎండబెడుతున్నారని ఫైర్‌ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాళేశ్వరం పంపులను వెంటనే ప్రారంభించాలి డిమాండ్‌ చేశారు. సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, కొత్త ప్రభాకర్‌ రెడ్డిలు మీడియాతో మాట్లాడారు. నేషనల్‌ డ్యాం సెఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్‌ఎ) రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడానికి లేదని జగదీశ్‌ రెడ్డి అన్నారు. సూచించిన పద్దతుల్లో గతంలో గ్రౌండింగ్‌ పూర్తి చేశామని, అన్ని పరీక్షలు పూర్తి అయ్యాయని, వచ్చి ప్రాజెక్ట్‌ ను సమీక్షించి అనుమతతులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలన్నారు. కానీ ఇప్పటి వరకు ఎన్‌డీఎస్‌ఎకు లేఖ రాయలేదని, అనుమతులు పొందలేదని ఆరోపించారు. కానీ సుందిళ్ల, అన్నారం బ్యారేజీలపై బీఆర్‌ఎస్‌ను బద్నాం చేసేందుకు ఎన్డీఎస్‌ఏ చెప్పలేదని ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని దుయ్యబట్టారు. గోదావరి, కృష్ణ నుంచి లక్షలాది క్యూసెక్కుల నీళ్లు సముద్రం పాలవుతున్నాయని మండిపడ్డారు. ఈ నీటిని ఎత్తి తెలంగాణలోని ప్రాజెక్ట్‌ లు, వాగులు, కుంటలు నింపుకోవడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌ వృధా అని, ఎస్‌ఆర్‌ఎస్‌పీ సూర్యాపేటకు నీళ్లు ఇవ్వొచ్చని ఆనాడు కాంగ్రెస్‌ నేతలు ఊదరగొట్టారన్నారు. మరి ఎందుకు నీళ్లు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఎప్పటికైనా ఎస్‌ఆర్‌ఎస్‌పీ 2 ని బతికించేది కాళేశ్వరం ప్రాజెక్ట్‌నే తప్ప మరొకటి కాదన్నారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాభావం లేక కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పారు. ఎల్లంపల్లి నుంచి మాత్రమే నీటిని ఇస్తామంటే సాధ్యంకాదని, ఏనాటికైనా కాళేశ్వరం నీళ్లు మాత్రమే రావాలని అన్నారు. అందువల్ల వెంటనే నాగర్జున సాగర్‌ ఎడమకాలువ, శ్రీశైలం పైన్న ఉన్న అన్ని ఎత్తిపోతల, జూరాల కాలువలను 100 శాతం కిందికి వదలాలని మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఎస్‌ఆర్‌ఎస్‌పీలో ప్రస్తుతం 50 టీఎంసీల నీళ్లు చేరాయని, ఇక్కడి నుంచి తక్షణమే ఎల్‌ఎండీకి 25 లిఫ్ట్‌ చేయాలని మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ డిమాండ్‌ చేశారు. గత ఆగస్టులో 3.73 లక్షల ఎకరాలకు బీఆర్‌ఎస్‌ సర్కార్‌ నీటిని అందించిందని మెదక్‌ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌ రెడ్డి చెప్పారు. కానీ ఈ సారి కేవలం 1.25 లక్షల ఎకరాలకు మాత్రమే రైతులు నాట్లు వేసారన్నారన్నారు.

Spread the love