పీజీ వైద్య విద్యార్థినికి అస్వస్థత

నవతెలంగాణ – వరంగల్
వరంగల్‌ కాకతీయ వైద్య కళాశాలలో పిల్లల వైద్య విభాగంలో పీజీ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని డాక్టర్‌ లాస్య శనివారం మైగ్రేన్‌(తలనొప్పి) మాత్రలు మోతాదుకు మించి వేసుకోవడంతో అస్వస్థతకు గురయ్యారు. ఎంజీఎం ఆసుపత్రిలోని ఆర్‌ఐసీయూ విభాగంలో చికిత్స అందించడంతో కోలుకున్నారు. ఇదే కళాశాలలో మూడు నెలల కిందట పీజీ(అనస్థీషియా) మొదటి సంవత్సరం విద్యార్థిని డాక్టర్‌ ప్రీతి ఆత్మహత్య సంఘటన నేపథ్యంలో లాస్య కూడా వేధింపులతోనే ఆత్మహత్యాయత్నం చేశారని ప్రచారం జరగడం కలకలం రేపింది. కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ మోహన్‌దాసు, ఎంజీఎం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌ ఈ ప్రచారాలను కొట్టిపారేశారు. ‘విద్యార్థిని లాస్యకు ఇంటర్‌ చదువుకునే సమయం నుంచే మైగ్రేన్‌ ఉంది. శనివారం ఉదయం 8 గంటల సమయంలో నొప్పి నివారణ మాత్ర వేసుకుంది. తగ్గకపోవడంతో అరగంటలోనే మరొకటి వేసుకోవడంతో అది వికటించింది. తల తిప్పినట్లు అనిపించడంతో జాగ్రత్తపడిన విద్యార్థిని ఎంజీఎం ఆసుపత్రికి వచ్చి చికిత్స తీసుకున్నారు. తనలో వస్తున్న మార్పులను గుర్తించి నేరుగా ఆసుపత్రికి వచ్చినట్లు తెలిపారు. ఎవరూ తప్పుడు ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు.

Spread the love