నవతెలంగాణ – హైదరాబాద్
‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీయే కాదు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు ప్రపంచం చూసేలా చేసింది. తెలుగోడి సత్తా ఏంటో అంతర్జాతీయ వేదికపై చూపించింది. ఆ సినిమాకు ఎన్ని అంతర్జాతీయ పురస్కారాలు దక్కాయో.. ఎంత మంది అంతర్జాతీయ ప్రముఖులు ప్రశంసించారో లెక్కేలేదు. ఏకంగా ప్రతిష్ఠాత్మక ఆస్కార్ పురస్కారాన్ని గెలుచుకుంది ఈ చిత్రంలోని నాటు నాటు పాట. ఇంత ఆదరణ చూరగొన్న ఆర్ఆర్ఆర్ టీమ్.. తాజాగా మరో అరుదైన గౌరవం దక్కించుకుంది. ఈ బృందానికి ఏకంగా ఆస్కార్ కమిటీలో అవకాశం లభించింది. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డులను ప్రదానం చేసే ‘ద అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కొత్తగా ఆస్కార్ కమిటీలో 398 మందికి సభ్యత్వం కల్పించింది. ఇందులో ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్‌కు చెందిన ఆరుగురు ఉండడం విశేషం. మన స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్‌తో పాటు సంగీత దర్శకుడు కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్, అలాగే ఛాయాగ్రాహకుడు సెంథిల్, ప్రొడక్షన్ డిజైనర్ సిరిల్‌లకు ఈ కమిటీలో స్థానం దక్కింది. దీంతో సోషల్ మీడియా వేదికగా వీరికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.