చెలరేగిన షెఫాలీ

A raging Shefali– రాణించిన జెమీమా, మంధాన
– మలేషియాతో మ్యాచ్‌ వర్షార్పణం
హౌంగ్జౌ : ఆసియా క్రీడల్లో భారత క్రికెట్‌ జట్టు ఘనమైన ఎంట్రీకి వరుణుడు అడ్డు నిలిచాడు. గురువారం క్వార్టర్‌ఫైనల్లో మలేషియా మహిళల జట్టుతో తలపడిన భారత అమ్మాయిలు.. తొలుత 15 ఓవర్లలో 173 పరుగుల భారీ స్కోరు నమోదు చేశారు. వర్షం కారణంగా మ్యాచ్‌ను తొలుత 15 ఓవర్లకు కుదించినా.. మలేషియా ఇన్నింగ్స్‌ సందర్భంగా మరోసారి వరుణుడు అడ్డు తగిలాడు. దీంతో మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. టోర్నీలో ఉత్తమ సీడింగ్‌ ప్రకారం భారత్‌ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌కు ఓపెనర్లు స్మృతీ మంధాన (27), షెఫాలీ వర్మ (67, 39 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) అదిరే ఆరంభాన్ని అందించారు. షెఫాలీ అర్థ సెంచరీతో కదం తొక్కగా.. మంధాన ఐదు బౌండరీలతో మెరిసింది. జెమీమా రొడ్రిగస్‌ (47 నాటౌట్‌, 29 బంతుల్లో 6 ఫోర్లు), రిచా ఘోష్‌ (21 నాటౌట్‌, 7 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) ధనాధన్‌ ఆటతో అదరగొట్టారు. 15 ఓవర్లలో 2 వికెట్లకు భారత్‌ 173 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. మలేషియా ఛేదనలో 0.2 ఓవర్లలో 1/0 స్కోరు వద్ద వర్షం మ్యాచ్‌కు ఆటంకం కలిగించింది.

Spread the love