రియలిస్టిక్‌ ఎంటర్‌టైనర్‌

రియలిస్టిక్‌ ఎంటర్‌టైనర్‌జబర్దస్త్‌ ఫేమ్‌ గెటప్‌ శ్రీను ‘రాజు యాదవ్‌’తో హీరోగా ఆరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కష్ణమాచారి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. సాయి వరుణవి క్రియేషన్స్‌, చరిష్మా డ్రీమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌లపై కె. ప్రశాంత్‌ రెడ్డి, రాజేష్‌ కల్లెపల్లి సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌, పాటలకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈనెల 17న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు కష్ణమాచారి మీడియాతో మాట్లాడుతూ, ‘మాది మహబూబ్‌ నగర్‌. 15 ఏళ్ల క్రితం ఇండిస్టీకి వచ్చాను. నీది నాది ఒకే కథ, విరాటపర్వం చిత్రాలకు దర్శకుడు వేణు ఉడుగుల దగ్గర అసోసియేట్‌ డైరెక్టర్‌గా పని చేశాను. దీంతో పాటు ఒక స్పానిష్‌ ఫిల్మ్‌, మరిన్ని కొన్ని చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేశాను.
దర్శకుడిగా ఇది నా తొలి చిత్రం. దాదాపు 90 శాతం మనుషుల్లో ఏదో ఒక చిన్న లోపం ఉంటుంది. ఈ కథకు ఒక లోపం ఉన్న పాత్ర కావాలి. ఈ తరహాలో కొత్త క్యారెక్టరైజేషన్‌ చెప్పాలని భావించాను. అలాంటి సమయంలో రాజేంద్రప్రసాద్‌, అలీ నటించిన ఓ సినిమాలో కోటి రూపాయిలు లాటరీ టికెట్టు తగిలితే నవ్వుతూనే చనిపోయిన ఓ సీన్‌ ఉంటుంది. సినిమా అంతా అలా నవ్వుతూనే ఉంటాడు. అది నా మైండ్‌లో బాగా రిజిస్టర్‌ అయ్యింది. అలాగే క్రికెటర్‌ లక్ష్మీపతి బాలాజీకి చిన్నప్పుడు ఏదో సర్జరీ జరిగింది. దాని కారణంగా ఆయన మొహం ఎప్పుడూ నవ్వుతూ ఉన్నట్లే కనిపిస్తుంది. తన నవ్వు వెనుక ఉన్న రహస్యాన్ని ఓ సందర్భంలో ఆయనే చెప్పారు.
ఇలాంటి లోపంతో క్యారెక్టరైజేషన్‌ రాసుకుంటే బావుంటుందనిపించింది. చాలా ఫన్‌ జనరేట్‌ అయ్యే పాత్ర ఇది. సహజత్వం కూడకున్న సినిమాలంటే ఇష్టం. రాజు యాదవ్‌ కూడా రియలిస్టిక్‌గా ఉంటుంది. అన్నీ రియల్‌ లోకేషన్స్‌లో షూట్‌ చేశాం. ఇది వెరీ పెర్ఫార్మెన్స్‌ బేస్డ్‌ క్యారెక్టర్‌. గెటప్‌ శ్రీను ఈ పాత్రకు పర్ఫెక్ట్‌ అనిపించారు. ఆయన నటన మెస్మరైజ్‌ చేస్తుంది’ అని తెలిపారు.

Spread the love