పెట్టుబడిదారులకు రెడ్‌ కార్పెట్‌

A red carpet for investors– స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌తో పెద్ద ఎత్తున పరిశ్రమలు
– 44శాతం వరకు రాయితీలు
– శాసనసభలోపారిశ్రామిక విధానంపై ఏపీ సీఎం చంద్రబాబు
– కార్మికుల ఊసేలేని ప్రసంగం
అమరావతి: రాష్ట్రానికి 35 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా పెట్టుబడిదారులకు అన్ని రకాల ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. నూతన పారిశ్రామిక విధానంపై గురువారం సాయంత్రం శాసనసభలో ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. పైవేటు రంగంలోనే పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేయడం, వాటిని ప్రపంచ స్థాయికి అభివృద్ధి చేయడం, లావాదేవీలను ప్రపంచ స్థాయిలో నిర్వహించడం, పెట్టుబడిదారులకు భూములు, నీరు, కరెంటు వంటివి ప్రభుత్వమే సమకూర్చడం, ఉత్పత్తుల ఎగుమతులకు అవసరమైన సదుపాయాలు కల్పించడం వంటి అంశాల గురించి ఆయన వివరించారు. తన సుదీర్ఘ ప్రసంగంలో పరిశ్రమలకు అత్యంత కీలకమైన కార్మికుల గురించి, కార్మిక చట్టాల అమలు గురించి. వారి సంక్షేమం గురించి మాట మాత్రంగా కూడా ప్రస్తావించలేదు. అదే సమయంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున చోటుచేసుకుంటున్న పారిశ్రామిక ప్రమాదాలు, వాటి నివారణ చర్యల గురించి కూడా సిఎం మాట్లాడలేదు. అదే విధంగా కాలుష్య నివారణకు నూతన విధానంలో ఎటువంటి చర్యలుంటాయన్న అంశాన్ని కూడా సిఎం ప్రస్తావించలేదు. ఇక నుంచి స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ అనేదే ప్రభుత్వ విధానంగా ఉంటుందని తన ప్రసంగంలో చంద్రబాబు పునరుద్ఘాటించారు. రూ.35 లక్షల కోట్ల పెట్టుబడులు రావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, తద్వారా 20 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. బ్రాండ్‌ కంపెనీలతో పాటు నూతన బ్రాండ్లను ప్రోత్సహిస్తామని అన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఎక్కువగా ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. 175 నియోజకవర్గాల్లో ప్రతి చోటా పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించామన్నారు. పోర్టు ఆధారిత పరిశ్రమలు తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలుపుతామని ఆయన వెల్లడించారు. తీర ప్రాంతానికి దగ్గరలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. రెండేళ్ల వ్యవధిలోనే ఎక్కువ ప్రాజెక్టులు వచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలిపారు.
గత ప్రభుత్వంలో పెట్టుబడులు రాలేదు…
గత ప్రభుత్వ హయాంలో 227 ఎంవోయులు జరిగినా రాష్ట్రానికి ఎటువంటి పెట్టుబడులు రాలేదని చంద్రబాబు చెప్పారు. గత ఐదేళ్లలో పన్నులు, కరెంటు ఛార్జీలు పెంచడం వల్ల పరిశ్రమలు మనుగడ సాగించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వకుండా ఐదేళ్లపాటు ఇబ్బంది పెట్టారన్నారు.
సబ్సిడీలు ఇలా…
పరిశ్రమలకు ప్రభుత్వం 12 శాతం సబ్సిడీ ఇస్తుందన్నారు. ఉద్యోగాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన వారికి మరో 10 శాతం అదనంగా సబ్సిడీ ఇస్తామన్నారు. గరిష్టంగా 44 శాతం ప్రోత్సాహకాలు వస్తాయన్నారు. 18 నెలల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే మరింత ప్రోత్సాహకం ఉంటుందన్నారు.

Spread the love