పోరాటాల గడ్డపై ఎర్రజెండా ఎగరాలి

On the ground of struggles A red flag should be raised– భువనగిరి కోట నుంచి పార్లమెంట్‌కు కమ్యూనిస్టు బిడ్డను పంపాలి
– 19న సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండీ జహంగీర్‌ నామినేషన్‌
– భారీప్రదర్శన, బహిరంగ సభ
– హాజరుకానున్న అగ్రనేతలు బీవీ రాఘవులు,తమ్మినేని : పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ -నకిరేకల్‌
పోరాటాల గడ్డ నుంచి ఎర్రజెండా ముద్దుబిడ్డ సీపీఐ(ఎం) ఎంపీ అభ్యర్థి ఎండీ.జహంగీర్‌ను పార్లమెంట్‌కు పంపించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద మోసగాడు అని, మూడోసారి గెలిస్తే దేశాన్ని నాశనం చేస్తారని అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా నకిరేకల్‌ పట్టణ కేంద్రంలోని నర్రా రాఘవరెడ్డి భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీ ఎన్నికల ముందు ప్రకటించిన మ్యానిఫెస్టోకు, అధికారంలోకి వచ్చిన తర్వాత అనుసరిస్తున్న విధానాలకు సంబంధం లేదన్నారు. పదేండ్లలో మోడీ ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగించారని విమర్శిం చారు. ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని అధికారంలోకొచ్చాక విస్మరిస్తార న్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టకుండా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బీజేపీిలో చేరుతారని ప్రకటించడం సరైంది కాదన్నారు. రేవంత్‌ రెడ్డి బీజేపీిలో చేరుతారని ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్‌ షా ఏమైనా చెప్పారా.. చెబితే ప్రజలకు వివరించాలన్నారు. అర్థంపర్థం లేని విమర్శలు చేసి తమ స్థాయిని దిగజార్చు కుంటున్నారన్నారు.
ఎంతో పోరాట చరిత్ర కలిగిన భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గంలో అవకాశవాదులను ఓడించి.. ప్రజల గొంతుకగా ఉన్న సీపీఐ(ఎం) అభ్యర్థి జహంగీర్‌ను పార్లమెంటుకు పంపించాలని కోరారు. విద్యార్థి దశ నుంచే జహంగీర్‌ కమ్యూనిస్టు ఉద్యమంలో పని చేస్తున్నారన్నారు. మూసీ ప్రక్షాళన పోరాటం, కార్మిక, కర్షక వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారన్నారు. పేదలకు, రైతులకు, ప్రజలకు ఎర్రజెండా ద్వారానే న్యాయం జరుగుతుందన్నారు. ప్రజలందరూ ఆలోచించి ఉద్యమ చరిత్ర కలిగిన కమ్యూనిస్టు అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈనెల 19న జహంగీర్‌ నామినేషన్‌ కార్యక్రమం భువనగిరిలో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు హాజరుకానున్నట్టు తెలిపారు.
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌ రెడ్డి మాట్లాడుతూ.. కమ్యూనిస్టుల పోరాట వారసత్వాన్ని కొనసాగించేందుకు పార్లమెంటు ఎన్నికల్లో భువనగిరి ఎంపీ అభ్యర్థి ఎండీ.జహంగీర్‌ను గెలిపించాలని కోరారు. సీపీఐ(ఎం) అభ్యర్థిని పార్లమెంటుకు పంపిస్తే భువనగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయొద్దన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కందాల ప్రమీల, నాయకులు బొజ్జ చిన్న వెంకులు, రాచకొండ వెంకట్‌గౌడ్‌, వంటిపాక వెంకటేశ్వర్లు, సిహెచ్‌ లూర్డు మారయ్య, ఒంటెపాక కృష్ణ, చెన్నబోయిన నాగమణి, ఏర్పుల రాజేశ్వర్‌ పాల్గొన్నారు.

Spread the love