నియంతృత్వానికి ప్రతిబింబం

– సీపీఐ(ఎం) రాజ్యసభ ఎంపీ బికాష్‌ రంజన్‌ భట్టాచార్య
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
– ప్రజలు ఎన్నుకున్న సీఎం తోలుబొమ్మగా మారుతారు
– ప్రజాస్వామ్యమంటే అధికార పంపిణీ, కేంద్రీకరణ కాదు
– చిల్లర రాజకీయాలు మాని, రాజ్యాంగాన్ని పరిరక్షించండి : సీపీఐ(ఎం) రాజ్యసభ ఎంపీ బికాష్‌ రంజన్‌ భట్టాచార్య

ఢిల్లీ బిల్లు ఆమోదంతో ప్రజలు ఎన్నుకున్న ముఖ్య మంత్రి తోలుబొమ్మగా మారుతారని సీపీఐ(ఎం) రాజ్యసభ నేత బికాష్‌ రంజన్‌ భట్టాచార్య అన్నారు. ఢిల్లీ బిల్లుపై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో సీపీఐ (ఎం) తరపున బికాష్‌ రంజన్‌ భట్టాచార్య మాట్లాడారు. ఈ బిల్లు ను చూస్తే నాగరికత వెనక్కి వెళ్తున్నట్లుందని అన్నారు. రాజ్యాంగ అసెంబ్లీలో పరిపాలన పాత్రపై చర్చించినట్లు అందరికీ తెలుసని, గవర్నర్‌ మరొక అధికార కేంద్రం కాకూడదని నిర్ణయించారని తెలిపారు. ఎన్నికైన ప్రభుత్వం, ప్రజా ప్రతినిధుల సలహాలను గవర్నర్‌ అమలు చేయాలనేది ప్రాథమిక సూత్రమని అన్నారు. రాజ్యాంగంలో సమాఖ్య వ్యవస్థ ఉందని తెలిపారు. రాజ్యాంగంలో ఢిల్లీ రాష్ట్రం కాదని, అది కేంద్ర పాలిత ప్రాంతమని అన్నారు. అయినప్ప టికీ హేతుబద్ధంగా ఢిల్లీ రాష్ట్రమని, దానికి కొన్ని అధికారా లు ఉన్నాయని తెలిపారు. పరిపాలించే హక్కు ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు ఉందని, ఇది రాజ్యాంగం సవరణ 239 ఎఎ స్పష్టం చేస్తుందని అన్నారు. ఎన్నికైన ప్రజా ప్రతినిధుల కు జవాబుదారీతనంగా గవర్నర్‌, బ్యూరోక్రసీ ఉండాలని, ఇదే రాజ్యాంగ నైతికత అని తెలిపారు. ఈ పార్టీ, ఆ పార్టీ అన్నది సమస్య కాదని, ఇది ప్రజాస్వామ్య గణతంత్రమని అన్నారు. అది స్వాతంత్య్ర పోరాట ఫలితమని పేర్కొన్నారు. కొంత మంది స్వాతంత్య్ర పోరాట వారసత్వం లేని వాళ్లు భిన్నంగా ఆలోచిస్తారని తనకు తెలుసన్నారు. స్వాతంత్య్ర పోరాటం, ప్రాణ త్యాగాల ఫలితమే ప్రజా ప్రభుత్వమని అన్నారు. కొంత మంది బ్రిటీష్‌ వారికి లొంగిపోయిన వాళ్ల గురించి కాదని ఎద్దేవా చేశారు. పార్లమెంట్‌ అధికారం గురించి ఎవ్వరూ ప్రశ్నించటం లేదని, అయితే అధికారం వివేకంతో కూడుకొని ఉండాలని అన్నారు. వివేకంతో లేని అధికారం రాజ్యాంగానికి విరుద్ధంగా, నిరంకుశంగా మారు తుందని పేర్కొన్నారు. ప్రజలకే అంతిమ నిర్ణయం ఉంటుం దని తెలిపారు. ఈ బిల్లు నియంతృత్వాన్ని ప్రతిబింబిస్తుం దన్నారు. తనకు నచ్చిన బ్యూరోక్రాట్‌ని నియమిస్తే, ఆయన ప్రజా ప్రభుత్వాన్ని నియంత్రిస్తాడని పేర్కొన్నారు. ఈ బిల్లు లో పూర్తిగా ఆధునిక మానవత్వం కొరవడిందని అన్నారు. ప్రజాస్వామ్యమంటే అధికారాల పంపిణీ అని, అధికార కేంద్రీకరణ కాదని స్పష్టం చేశారు. ఈ బిల్లు వల్ల ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి తోలుబొమ్మగా మిగిలిపోతారని, ముఖ్యమంత్రిని బ్యూరోక్రాట్‌ నియంత్రిస్తాడని అన్నారు. చిల్లర రాజకీయాలు మాని అందరూ ఈ కీలకమైన పరిస్థితి అర్థం చేసుకోవాలని రాజకీయ పార్టీల నేతలకు సూచించారు. రేపు ఒడిశా గవర్నర్‌కు సబ్‌ సర్వెంట్‌గా ఒడిశా సీఎం, ప్రభుత్వం ఉండాలని బిల్లు ఆమోదిస్తారా? అప్పుడు ఏం చేస్తారని ప్రశ్నించారు.

Spread the love