ధాన్యం కొనుగోళ్లపై నివేదిక రెడీ

A report on grain procurement is ready– సీఎంకు అందజేయనున్న మంత్రివర్గ ఉపసంఘం
– కీలక నిర్ణయాలు తీసుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం
– ఉమ్మడి నిజామాబాద్‌ ప్రజాప్రతినిధులతో సమీక్షించిన ఉపసంఘం
– 26న మంత్రివర్గ సమావేశంలో ఆమోదానికి నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ధాన్యం కొనుగోళ్లపై నివేదిక రెడీ అయింది. గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి మంత్రివర్గ ఉపసంఘం ఈ నివేదికను అందజేయనున్నది. 26న మంత్రివర్గ సమావేశంలో ఆమోదించాలని నిర్ణయించింది. కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనున్నది. ఈ నేపథ్యంలో బుధవారం ఉమ్మడి నిజామాబాద్‌ ప్రజాప్రతినిధులతో ఉపసంఘం సమీక్షించింది. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, విప్‌ లక్ష్మణ్‌ కుమార్‌, ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి, మహమ్మద్‌ అలీ షబ్బీర్‌, టీపీసీసీ అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు శాసనమండలి సభ్యులు బల్మూరి వెంకట్‌, ఎమ్మెల్యేలు సుదర్శన్‌ రెడ్డి, లక్ష్మికాంతారావు, పౌరసరఫరాల శాఖ కార్యదర్శి , కమిషనర్‌ డీ.ఎన్‌. చౌహన్‌ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ 2024-25 ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలుకు సంబంధించి వివిధ అంశాలపై మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫారసులతో కూడిన తుది నివేదికపై అక్టోబర్‌ 26న జరిగే క్యాబినెట్‌ సమావేశంలో చర్చించనున్నట్టు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన ఏర్పడిన మంత్రివర్గ ఉపసంఘం ధాన్యం కొనుగోలుపై బ్యాంకు గ్యారంటీతో పాటు మిల్లింగ్‌ చార్జీలు పెంచడం వంటి అంశాలపై పలు సిఫారసులతో కూడిన నివేదికను రూపొందించినట్టు వెల్లడించారు. మధ్యాహ్న భోజన పథకం, హాస్టల్స్‌, ఐసీడీఎస్‌ వంటి పథకాల కింద పంపిణీ చేయడానికి సంబంధించి సన్నబియ్యంపై (10 శాతం పగిలిన బియ్యం) ఉన్న ఖర్చులను పెంచడంతో పాటు వ్యవసాయ శాఖ పాత్ర, ఎస్‌డబ్ల్యూసీ /ఏఎంసీ గోదాముల్లో 10 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం నిల్వ చేయడంతో పాటు ధాన్యం నిల్వఉంచే సమయంలో ‘డ్రైయేజ్‌’ నష్టంపై ఉప సంఘం అధ్యయనం చేసినట్టు ఆయన తెలిపారు.
రాష్ట్రంలో 60.73 లక్షల ఎకరాల భూమిలో ధాన్యం సాగు చేయబడిందనీ, 146.70 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తున్నట్టు ఆయన చెప్పారు. 80 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందులో 30 లక్షల మెట్రిక్‌ టన్నులు దొడ్డు ధాన్యం, 50 లక్షల మెట్రిక్‌ టన్నుల సన్నరకం ధాన్యం సేకరించేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు మంత్రి ఉత్తమ్‌ తెలిపారు. ఈ ఖరీఫ్‌ సీజన్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వం సన్న రకం ధాన్యానికి క్వింటాల్‌కు మద్దతు ధరతో పాటు అదనంగా రూ.500 బోనస్‌ను అందజేయనున్నట్టు ఆయన పునరుద్ఘాటించారు.
సన్నరకం ధాన్యం నిల్వలకుగాను ప్రత్యేకంగా గోదాముల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం అందిస్తున్న బోనస్‌ను ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దే నేరుగా రైతుల ఖాతాల్లో పడేలా ఆర్థికశాఖకు చెందిన ఈ-కుబేర్‌ ప్లాట్‌ఫారమ్‌ ద్వారా జమ చేసే ఏర్పాట్లు చేశామన్నారు. ధాన్యం కొనుగోళ్ళకు ప్రభుత్వం అందించే మద్దతు ధరతో పాటు అదనంగా చెల్లించే బోనస్‌పై రైతుల్లో అవగాహన పెంపొందించేందుకుగాను గోడపత్రికలు ముద్రించి రైతులకు చేరేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
మొత్తం 7,248 పచ్చి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించబోతున్నట్టు ఆయన తెలిపారు. అందులో 2,539 కేంద్రాల్లో ఇప్పటికే కొనుగోళ్లు ప్రారంభమైనట్టు చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రవాణా, మౌలిక సదుపాయాల ఏర్పాట్లు చేయబడ్డాయన్నారు. తేమని కొలిచే పరికరాలు, తూకం యంత్రాలు, టార్పాలిన్లు, ధాన్యం శుభ్రం చేసే పరికరాలు, డ్రయర్లు, తాలును తొలగించే పరికరాలతో పాటుగా సన్నరకం ధాన్యాన్ని గుర్తించడానికి వీలుగా డయల్‌ కాలిపర్లు వంటి అవసరమైన మౌలిక వసతులను సనకూర్చుతున్నట్టు ఆయన తెలిపారు. ధాన్యం కొనుగోలుకు సరిపడా గన్నీ బ్యాగ్‌లు అందుబాటులో ఉంచామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తాగునీరు, ఆశ్రయం వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. సరిపడా సిబ్బంది, ఎప్పటికప్పటికి కొనుగోలు ఎంట్రీకి గాను ట్యాబ్‌లతో పాటు పుస్తకాలు, హమాలీ సేవలను విరివిగా వినియోగించుకునేందుకు వీలుగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
రైతులు ఇబ్బందులకు గురి కాకుండా ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారుల బృందాలు పర్యవేక్షిస్తుంటాయన్నారు. మధ్యదళారుల చేతిలో రైతులు మోసపోకుండా చూసేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. హెడ్‌ ఆఫీసులో టోల్‌-ఫ్రీ నంబర్‌తో కూడిన ఫిర్యాదుల పరిష్కార కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే నల్లగొండ, యాదాద్రి జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యా యని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. అక్టోబర్‌ 22 నాటికి 230 మంది రైతుల నుంచి రూ. 3.34 కోట్ల విలువైన 1,440 మెట్రిక్‌ టన్నుల పచ్చి ధాన్యం కొనుగోలు చేసేందుకు రూట్‌ మ్యాప్‌ రూపొందించుకున్నట్టు ఆయన వివరించారు.

Spread the love