ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం లో విస్తరిస్తున్న కోతుల సమస్యను పరిష్కరించాలని మండల ప్రజలు శనివారం పంచాయతీ కార్యదర్శి కొర్నేబెల్లి సతీష్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తరచూ కోతుల దాడులతో భయాందోళనలు గురవుతున్నారని తెలిపారు. తోటలు, పంటలను నాశనం చేస్తున్నాయని అన్నారు. మేడారంలో వనదేవతల దర్శనానికి వచ్చిన భక్తులను కూడా వంటలు చేసుకోకుండా అనేక ఇబ్బందులు గురిచేస్తున్నాయని అన్నారు. పంటలు నాశనం చేసుడే కాకుండా ఇండ్లలో ఉన్న నిత్యవసర సరుకులను కూడా ఆగం ఆగం చేస్తున్నాయని, వ్యక్తులపై దాడులు చేసి గాయాలపాలు చేస్తున్నాయన్నారు. కోతుల సమస్య పరిష్కరించే నాధుడే కరువయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కోతులను పట్టించి దూరంగా తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చేయడం బాబురావు, పీరిల వెంకన్న, రానా రమేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.