నీట్‌ రద్దుపై అసెంబ్లీలో తీర్మానం చేయాలి

On cancellation of NEET A resolution should be passed in the assembly– మెడికల్‌ ప్రవేశాలు రాష్ట్ర ప్రభుత్వాలే చేపట్టాలి
– సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్‌)ను రద్దు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి ఆమోదింపజేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. నీట్‌ ప్రవేశ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు. విద్యార్థుల జీవితాలు గందరగోళమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరీక్ష రాసిన 24 లక్షల మంది విద్యార్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. ఎన్డీఏ పాలనలో ఉన్నత చదువుల కోసం నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షల్లో అవకతవకలు, లీకేజీలు సర్వసాధారణంగా మారాయని తెలిపారు. అత్యున్నతమైన పరీక్షలను నిర్వహించడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమై విశ్వసనీయతను కోల్పోయిందని విమర్శించారు. గతంలో మాదిరి గానే మెడికల్‌ అడ్మిషన్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతివ్వాలని కోరారు. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం నీట్‌ను రద్దు చేయాలనీ, ఈ పరీక్షను నిర్వహించే అధికారాలను తమకు అప్పజెప్పాలని కోరుతూ అసెంబ్లీలో చేసిన తీర్మానం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ విధంగా అసెంబ్లీలో తీర్మానం చేసి, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే మెడికల్‌ అడ్మిషన్‌ పరీక్షలను నిర్వంహిచేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు.
రూ.40 లక్షల నష్ట పరిహారమివ్వాలి
సౌత్‌ గ్లాస్‌ కంపెనీ ప్రమాద మృతుల కుటుంబాలను ఆదుకోవాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని డిమాండ్‌
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో సౌత్‌ గ్లాస్‌ ప్రయివేట్‌ కంపెనీలో కంప్రెషర్‌ పేలి ఆరుగురు కార్మికులు దుర్మరణం చెందడం, మరికొందరు గాయపడడం చాలా బాధాకరమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నట్టు తెలుస్తున్నదని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వారి మృతికి సంతాపం, కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. తక్షణమే ఒక్కొక్క మృతుని కుటుంబానికి రూ.40 లక్షలు, గాయపడిన వారికి రూ.10 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. వారంతా ఇతర రాష్ట్రాల వలస కార్మికులే కాబట్టి 1979 అంతర్రాష్ట్ర వలస కార్మిక చట్టం ప్రకారం వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని సూచించారు. అన్ని కంపెనీల్లో భద్రత ఆడిట్‌ నిర్వహించాలని కోరారు. ఇలాంటి ఘటనలు ఈ ప్రాంతంలో అనేకసార్లు జరిగినా, అధికారులు యాజమాన్యాల ప్రలోభాలకు లొంగి తనిఖీలు చేయడంలో విఫలమవుతున్నారని విమర్శించారు. తక్షణమే ఈ ఘటనపై విచారణ జరిపి, జాగ్రత్తలు పాటించని యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Spread the love