– టీఏజీఎస్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు బాబురావు, సచిన్
నవతెలంగాణ-ఆదిలాబాద్
పోడు భూములపై హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకూ పట్టా ఇవ్వాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం(టీఏజీఎస్) డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షులు మిడియం బాబురావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా గిరిజనులు, ఇతర పేదలు పోడు చేసుకుంటున్నారని, జూన్ 24 నుంచి 30 వరకు పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. గతంలో ఇదే అంశంపై అసెంబ్లీలో స్పందించిన సీఎం కేసీఆర్ 11లక్షల ఎకరాలకుపైగా పట్టాలిస్తామని ప్రకటించారన్నారు. తెలంగాణలో సుమారు 11 జిల్లాల్లో పోడు భూములు అధికంగా ఉన్నాయని తెలిపారు. మిగతా జిల్లాల్లోనూ పోడు వ్యవసాయం చేస్తున్న వారున్నారన్నారు. హరితహారం పథకంతో అటవీ భూముల్లో ప్రభుత్వం మొక్కల పెంపకం చేపడుతోందని, ఫలితంగా అటవీ అధికారులు, పోడు వ్యవసాయం చేసే రైతులకు మధ్య వివాదం నడుస్తోందని పేర్కొన్నారు. భూ హక్కు పత్రాలు ఉన్న భూములను వదిలేసి మిగతా ప్రాంతాల్లో మొక్కలు నాటుతామని అధికారులు చెబుతున్నా పోడు చేసుకుంటున్న భూములను వదలడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో 28 జిల్లాల నుంచి 2వేల 845 గ్రామ పంచాయతీల నుంచి 4లక్షల14వేల 353 దరఖాస్తులు ప్రభుత్వానికి వచ్చాయని తెలిపారు. భూమి 12లక్షల46వేల846 ఎకరాలుగా ఉందన్నారు. దరఖాస్తుల పరిశీలన, పరిష్కారం కసరత్తు తరువాత 1,50,224 దరఖాస్తులకు సంబంధించిన 4,01,405 ఎకరాల పోడు భూములకు పట్టాలు అందజేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారన్నారు. అంటే 2,64,129 దరఖాస్తులను మళ్లీ పెండింగ్‌లో పెట్టబోతున్నారని తెలిపారు. ఇది గిరిజన ప్రాంతంలో హక్కుపత్రం రాని పోడు సాగుదారులపై ఫారెస్ట్ అధికారుల దాడులను మరింత పెంచే ప్రమాదముందన్నారు. హక్కు పత్రాల పంపిణీ బాధ్యతలు గిరిజన సంక్షేమ శాఖ, కలెక్టర్‌లకు అప్పగించిన ప్రభుత్వం భూముల సర్వే కార్యక్రమం మాత్రం ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌కు ఇవ్వటం వల్లనే చాలా మంది నష్టపోతున్నారన్నారు. పోడు హక్కుల పంపిణీని ప్రభుత్వం హడావిడిగా ముగించకుండా హక్కులు వారికి గిరిజన, రెవెన్యూ, ఫారెస్ట్ శాఖల ద్వారా రీ సర్వే చేసి సాగులో ఉన్న ప్రతి ఒక్కరికీ హక్కులు ఇవ్వాలని టీఏజీఎస్ కోరుతోందని పేర్కొన్నారు.