– నేతలతో బీఆర్ఎస్ బాస్ అభిప్రాయ సేకరణ
– త్వరలోనే హస్తినకు కేసీఆర్
– బీజేపీ పెద్దలను కలిసేందుకే అంటున్న విశ్లేషకులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, సమీకరణాలు వేగంగా మారిపోబోతు న్నాయా..? రానున్న లోక్‌సభ ఎన్నికల్లో గులాబీ.. కమలం స్నేహ హస్తం అందుకోబోతున్నాయా..? అంటే విశ్లేషకుల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ‘బీజేపీతో మాకు ఎలాంటి పొత్తూ ఉండదు.. మాది పక్కా సెక్యులర్ పార్టీ…’ అంటూ బీఆర్ఎస్ నేతలు చెబుతున్నప్పటికీ జరుగుతున్న పరిణామాలు మాత్రం అందుకు భిన్నంగా ఉండటం గమనార్హం. ఇందుకు సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ సీనియర్ నేతలు, ముఖ్యుల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నట్టు వినికిడి. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం… రాష్ట్రంలో అధికారం కోల్పోయిన కారు పార్టీ.. లోక్‌సభ ఎన్నికల్లో ఎలాగైనా కాసిన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవటం ద్వారా పోయిన వైభవాన్ని తిరిగి సంపాదించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఇందుకోసం కేసీఆర్ గత నెల రోజుల నుంచి మేధోమథనం చేస్తున్నారు. ఇప్పటి వరకూ అధికారంలో ఉండటంతో ఏ కోణంలో చూసినా కారు పార్టీకి ఎలాంటి ఇబ్బందీ రాలేదు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో ఆ పార్టీకి రాజకీయంగా పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. బీఆర్ఎస్కు చెందిన పలువురు సీనియర్లు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్పర్సన్లు ఇప్పటికే హస్తం పార్టీలో చేరారు. మరికొందరు త్వరలోనే కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారు. మరోవైపు అసెంబ్లీలో వివిధ రంగాలపై శ్వేతపత్రాలను విడుదల చేయటం ద్వారా సీఎం రేవంత్…ప్రధాన ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టారు. త్వరలోనే వీటిపై కఠిన నిర్ణయాలు ఉంటాయంటూ ఆయన హెచ్చరించారు. ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి గట్టెక్కటం, రాబోయే లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కోవటం గులాబీ పార్టీకి పెద్ద సవాల్‌గా మారింది. ఈ క్రమంలో పార్టీనీ, క్యాడర్‌ను కాపాడుకోవటం మాజీ సీఎంకు ప్రతిష్టాత్మకమైంది. అందువల్లే కేసీఆర్… బీజేపీతో పొత్తు ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. తద్వారా పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవటంతోపాటు కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే ఎన్డీయేలో భాగస్వామ్యం కావాలన్నది ఆయన వ్యూహంగా కనబడుతున్నది. అలా అయితేనే ఇక్కడి రేవంత్ సర్కార్‌తో ఎలాంటి ఇబ్బందులనైనా తట్టుకోలగమనే అంచనాతో గులాబీ బాస్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ లెక్కలన్నీ వేసుకునే ఆయన బీజేపీ జాతీయ నాయకత్వంతో భేటీ కాబోతున్నారనీ, ఇందుకోసం త్వరలోనే ఢిల్లీ విమానమెక్కనున్నారని సమాచారం.
ఎవరి సీట్లు వారివే…
బీజేపీతో పొత్తుపై ఏకాభిప్రాయానికి వస్తే ప్రస్తుతమున్న సీట్లలో ఎవరివాటిలో వారే (బీజేపీ ఉంటే బీజేపీ, బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్) పోటీ చేయాలన్నది గులాబీ పార్టీ ఆలోచనగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆ పార్టీకి 9 ఎంపీ సీట్లు, బీజేపీకి 4 ఎంపీ సీట్లు ఉన్నాయి. పొత్తు కుదిరితే ఇప్పుడున్న సీట్లలో ఆయా పార్టీలే పోటీ చేస్తాయి. కాంగ్రెస్ సిట్టింగ్ సీట్లను ఈ రెండు పార్టీలూ పంచుకుని పోటీ చేస్తాయని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి అంశాలన్నింటిపై చర్చించి, తుది నిర్ణయం తీసుకోవటానికి వీలుగా కేసీఆర్ త్వరలోనే హస్తిన పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారని తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతోపాటు ప్రధాని మోడీని, ఇతర పెద్దలను ఆయన కలవనున్నారని చర్చ జరుగుతోంది. ఏదైమైనా ఆయన ఢిల్లీ పర్యటన తర్వాతే ఈ విషయమై ఒక స్పష్టత రానుంది.
కమలానికి చేరువగా గులాబీ?
2:58 am