పార్లమెంటుపై గులాబీ గురి..

Rose aimed at Parliament..– ఎంపీ అభ్యర్థులతో కేటీఆర్‌ వరుస భేటీలు
– టిక్కెట్‌ కోసం ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన నేతల విశ్వ ప్రయత్నాలు
– మహబూబ్‌నగర్‌ నుంచి శ్రీనివాసగౌడ్‌, పెద్దపల్లి నుంచి బాల్క సుమన్‌
– భువనగిరి నుంచి మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
శాసనసభ ఎన్నికల ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌.. రాబోయే పార్లమెంటు ఎలక్షన్లపై దృష్టి సారించింది. అందులో భాగంగా సిట్టింగ్‌ ఎంపీలతో ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఆది, సోమవారాల్లో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన పార్లమెంటు సభ్యులతో భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి బయటపడి…లోక్‌సభ ఎన్నికలకు పూర్తి స్థాయిలో సన్నద్ధమవ్వాలని ఆయన వారికి సూచించారు. ఆ మేరకు క్షేత్రస్థాయిలో క్యాడర్‌ను సిద్ధం చేయాలని ఆదేశించారు. శాసనసభ ఎన్నికల్లో ఒక్కో పార్లమెంటు స్థానం పరిధిలో బీఆర్‌ఎస్‌కు వచ్చిన ఓట్ల వివరాలను కేటీఆర్‌ అడిగి తెలుసుకున్నారు. గత ఎంపీ ఎన్నికల్లో ఆయా స్థానాల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని పరిశీలించారు. అప్పటికీ, ఇప్పటికీ ఉన్న వ్యత్యాసంపై లెక్కలు తీశారు. ఎంపీలతో కలిసి వాటిపై సమీక్షలు నిర్వహించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ తొమ్మిది స్థానాలను గెలుచుకుంది. అంతకుముందు (2018) నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అధికారాన్ని చేజిక్కించుకున్న సంగతి విదితమే. అయితే ఎంపీ ఎలక్షన్లకు వచ్చేసరికి మొత్తం 17 స్థానాల్లో బీజేపీ నాలుగు (సికింద్రాబాద్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌), కాంగ్రెస్‌ (నల్లగొండ, భువనగిరి, మల్కాజ్‌గిరి) మూడింటిని గెలుచుకున్నాయి. కారు పార్టీకి 9 స్థానాలే దక్కాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్‌ మినహా మిగతా అన్ని స్థానాల్లోనూ గెలిచేందుకు సర్వశక్తులూ ఒడ్డాలని గులాబీ పార్టీ భావిస్తోంది. శాసనసభ ఎన్నికల అనుభవం దృష్ట్యా ప్రస్తుతమున్న కొంతమంది సిట్టింగ్‌ ఎంపీలను మార్చి కొత్తవారికి అవకాశమివ్వాలని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ భావిస్తున్నారు. మెదక్‌ నుంచి ఆయనే బరిలోకి దిగనున్నారు. నిజామాబాద్‌ నుంచి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి పోటీ చేయనున్నారు. కరీంనగర్‌ నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌కే మరో ఛాన్స్‌ దక్కనుందని తెలిసింది. ఇక మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, పెద్దపల్లి, మహబూబాబాద్‌, జహీరాబాద్‌, చేవెళ్ల, ఖమ్మం, వరంగల్‌ స్థానాల్లో బీఆర్‌ఎస్‌కు సిట్టింగ్‌ ఎంపీలున్నారు. వీటిలో దాదాపు పాత వారికే టిక్కెట్లు కేటాయించాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. కానీ ఎమ్మెల్యేగా ఓడిపోయిన మాజీ మంత్రి శ్రీనివాసగౌడ్‌ మహబూబ్‌నగర్‌ టిక్కెట్టు కోసం, పెద్దపల్లి టిక్కెట్టు కోస మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు వినికిడి. భువనగిరి నుంచి గతంలో బూర నర్సయ్య గౌడ్‌ బీఆర్‌ఎస్‌ తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు. పలు సామాజిక సమీకరణాలే ఇందుకు కారణం. ఆ రీత్యా ఇప్పుడు ఆ టిక్కెట్టును దక్కించుకునేందుకు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్‌ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.
ఆ రెండింటిలో బలమైన అభ్యర్థులు…
గత ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నుంచి ఇప్పటి సీఎం రేవంత్‌ రెడ్డి, సికింద్రాబాద్‌ నుంచి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గెలుపొందారు. ఇప్పుడు ఈ రెండు స్థానాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్‌ఎస్‌ వాటిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఆయా నియోజకవర్గాల్లో ‘అన్ని రకాలుగా’ బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాలని కేసీఆర్‌ భావిస్తున్నారు.
చేవెళ్లలో మరోసారి గులాబీ జెండా ఎగరాలి కేటీఆర్‌ దిశా నిర్దేశం
చేవెళ్ల పార్లమెంటు స్థానంలో మరోసారి గులాబీ జెండా ఎగరాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆకాంక్షించారు. గెలుపే లక్ష్యంగా పని చేయాలని నాయకులు, కార్యకర్తలకు ఆయన దిశా నిర్దేశం చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల సమావేశాన్ని నిర్వహించారు. గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకూ పూర్తి సమన్వయంతో పని చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్‌ సూచించారు. భేటీలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాశ్‌ గౌడ్‌, అరికెపూడి గాంధీ, మాజీ ఎమ్మెల్యేలు కొప్పుల మహేశ్‌రెడ్డి, మెతుకు ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.
నాకు లైన్‌ క్లియర్‌ : ఎంపీ రంజిత్‌రెడ్డి
సమావేశానంతరం ఎంపీ రంజిత్‌రెడ్డి మీడియా తో మాట్లాడుతూ… తనను మరోసారి చేవెళ్ల నుంచి పోటీ చేయాలంటూ కేటీఆర్‌ సూచించారని అన్నారు. గెలుపే లక్ష్యంగా పని చేయలంటూ ఆయన ఆదేశించారని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ఖాళీ అవుతుందంటూ కాంగ్రెస్‌, బీజేపీ అసత్య ప్రచారాలు చేస్తున్నాయంటూ విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోయిన స్థానాలపై దృష్టి సారించటం ద్వారా ఎంపీ సీట్లలో గెలుపుకోసం ప్రణాళికలు సిద్ధం చేస్తామని వివరించారు.

Spread the love