మౌనాన్ని ఛేదించిన ఆకురాలిన చప్పుడు

సిద్ధార్థ కట్టా, డా||పాపినేని శివశంకర్‌ ఈ పుస్తకానికి చక్కటి ముందు (వెనుక) మాటలు రాశారు. కవి తన అమ్మమ్మ జరుబుల సౌభాగ్యమ్మకు ఈ పుస్తకం అంకితం చేశారు. 50కి పైగా కవితలున్న ఈ పుస్తకంలో స్వ – 1, స్వ-2; ఆమనిగీతం, బాణలి, అనల్పం, వింగ్స్‌ ఫీడమ్‌, విద్వేషపు వాన, కాంతి హననం, ముంపు, అడ్డాలో దిగులుమొహం, ఇది చెప్పాలనే, నిత్యం వెతుక్కోవడం లాంటి కవితలు కవి ఆంతర్యాన్ని ఆవిష్కరిస్తాయి. ప్రశ్నించే తత్వంలో ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఈ సంపుటికి శీర్షికగా పెట్టిన ఆకురాలిన చప్పుడు కవితలో (పేజీ 105) ఒక చోట కవి ఇలా అంటారు… ”గదిలో మాత్రం – నిశ్శబ్దపు పోట్ల దాడి/ గొంతు పెగలని ఆక్రందనలూ/ పెదాలు దాటని ప్రశ్నలూ, సమాధానాలూ!/ పలుగై పొడుస్తుంటాయి”/ ఎంత హింస – మౌనం చేసే గాయాలకు లేపనాలుండవు” ఇలాంటి భావోస్పోరక వాక్యాలు ప్రతి కవితలో, ప్రతి పుటలో వున్నాయి. పాఠకుల్ని ఆలోచింపజేస్తాయి.
శ్రామిక రాజ్య కాంక్షను ‘వాళ్ళు’ కవితలో (పేజీ 94) చివరి వాక్యాల్లో చెప్పాల్సిన అంశం బలంగా చెప్పారు కవి. ”అందుకే బస్తాలు మోసిన ‘చే’తులు/ చట్టాలు చెక్కే రోజునే/ వాళ్ళు కాళ్ళూ చేతులుగా మిగలకుండా/ మనుషులుగా వెలుగుతారు”
అలాగే ‘ఇంకొంచెం తవ్వండి’ (పేజీ 61) అనే కవితలో దు:ఖ భాష, భావన కనిపిస్తుంది ”గాయపడ్డ ఆకృతులను/ తడిమి తడిమి చూడండి/
వర్ణాలను విసిరేసే పలిగిన స్థూపమో/ సామ్యవాద పల్లకిలా ఇటుకల శిధిలమో/ మరో పురాతన వెలుతురుగా, ధిక్కార స్వరమై ఎదురొస్తుంది/ అప్పటికీ ఆ పొద్దు, ఇంకొంచెం తవ్వండి” అనే కవి భావం విశిష్టమైనది. విస్పష్టమైనది. ప్రతి ప్రశ్నా ఓ జ్ఞాపకమే. ప్రతి ప్రశ్నా ఓ పాఠమే! ప్రతి ప్రశ్నా ఓ ఆలోచనకు విప్లవమే” అంటూ అక్షరంతో అందర్నీ ఆలోచింపజేసే యువగళం శ్రీ వశిష్ఠ సోమేపల్లికి అభినందనలు.
– తంగిరాల చక్రవర్తి , 9393804472

ఆకురాలిన చప్పుడు

కవి : శ్రీ వశిష్ఠ సోమేపల్లి
పేజీలు : 128, వెల : 120/-
ప్రతులకు : ఛాయ రిసోర్స్‌సెంటర్‌
103, హరిత అపార్ట్‌మెంట్స్‌, ఎ-3,
మధురానగర్‌, హైదరాబాద్‌ – 38.
సెల్‌ : 7093165151

Spread the love