వరదల్లో చిక్కుకున్న ఒక సాధువు, ఇద్దరు సేవకులు

– ఎన్.డి.ఆర్.ఎఫ్ బృందం సహాయంతో సురక్షితంగా బయటపడ్డ వ్యక్తులు
నవతెలంగాణ-ఏర్గట్ల
పోచంపాడ్ లోని శ్రీరామ్ సాగర్ గేట్లు ఎత్తడంతో వరద పోటెత్తింది.వరద ఉధృతి వల్ల సావేల్,తడపాకల్ గ్రామాల మధ్యన గల గోదావరి నదిలో ఉన్న సాంబయ్య ఆశ్రమంలోని ముగ్గురు ఆశ్రమ వాసులు సంతోష్, నారాయణ, ముత్తెన్న నీట చిక్కుకున్నారు. ఈ విషయం తెలియడంతో, జిల్లా కలెక్టర్ వారిని రక్షించాలని అధికారులకు ఆదేశాలు జారిచేయడంతో, అధికారులు సోమవారం తడపాకల్ గోదావరి నది వద్దకు చేరి సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. మొదటగా ఫైర్ బృందం అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టగా.. వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో వారు వెనుదిరిగారు. అనంతరం ఎన్.డి.ఆర్.ఎఫ్ బృందం రంగంలోకి దిగి స్టీమర్ బొట్ల సహాయంతో సురక్షితంగా ఒడ్డుకు చేర్చడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆశ్రమానికి చెందిన 9 ఆవులు, ఒక గుర్రం అందులోనే ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. రక్షించబడిన సాధువులు ముగ్గురు సహాయక సిబ్బందికి, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. సహాయక చర్యల్లో భాగంగా ఆర్.డి.ఓ రాజాగౌడ్, ఆర్మూర్ ఏసీపీ బస్వా రెడ్డి, ఎమ్మార్వో శ్రీలత, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఎస్సై బి.రాము, సిఐ నవీన్, ఎంపీఓ శివ చరణ్ తదితరులు ఉన్నారు.
Spread the love