– పాకిస్తాన్ కంపెనీకి అప్పగించాలని సర్కార్ యత్నం
– పేదలకు ఆశ్రయం కల్పించిన తరువాతే ఇండ్లు కూల్చాలి
– ‘హైడ్రా’మాలు : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసెడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్
– బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి ఫతేనగర్‌లో ఎస్టీపీ పరిశీలన
నవతెలంగాణ – కూకట్‌పల్లి/బాలానగర్
మూసీ సుందరీకరణ పేరుతో వేల కోట్ల కుంభకోణం జరుగుతున్నదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. మూసీ సుందరీకరణను సీఎం రేవంత్ రెడ్డి ఓ పాకిస్తాన్ కంపెనీకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. బుధవారం కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆహ్వానం మేరకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లి ఫతేనగర్ ఎస్టీపీని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన పరిశీలించారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.గ్రేటర్ హైదరాబాద్‌ను మురుగునీటి రహిత నగరంగా మార్చే సంకల్పంతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.4 వేల కోట్లతో 31 ఎస్టీపీలకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఫతేనగర్‌లో ఏర్పాటు చేసిన 133 ఎంఎల్‌డీల ఎస్టీపీ ట్రయల్ రన్ దశలో ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎస్టీపీల నిర్మాణంలో నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. ఎస్టీపీల సందర్శనలో ఇది మొదటి అడుగు మాత్రమేనని.. ఉప్పల్ నల్లచెరువు, ఎల్‌బీనగర్, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్ ఎస్టీపీలను కూడా త్వరలోనే సందర్శిస్తామని చెప్పారు. మూసీ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి, మంత్రుల మాటలకు పొంతన లేదన్నారు. మూసీ శుద్ధి వెనుక ప్రభుత్వ అసలు ఉద్దేశం వేరే ఉందనే అనుమానం ప్రజల్లో ఏర్పడిందన్నారు.
మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇంటి తాళాలు అప్పగించాకే.. వారి ఇండ్లను కూల్చాలని డిమాండ్ చేశారు. అలా చేయకుంటే కూల్చివేతలను అడ్డుకుంటామని హెచ్చరించారు. మూసీని శుద్ధి చేయాల్సిన అవసరం లేదని, బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కట్టిన ఎస్టీపీలను వినియోగించుకుంటే సరిపోతుందని అన్నారు. హైడ్రా కూల్చివేతలపై పెద్దలకు ఒక న్యాయం, పేదలకు మరొక న్యాయమా అని అన్నారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న మంత్రుల, నేతల ఇండ్లు కూల్చిన తరువాత పేదల ఇండ్లు కూల్చాలన్నారు. హైడ్రా పేరుతో హైడ్రామాలు ఆపేసి హైదరాబాద్ ఇమేజ్‌ను కాపాడాలని సూచించారు. బీఆర్‌ఎస్ నగర ఎమ్మెల్యేలతో చర్చించి హైడ్రాపై ఒక నిర్ణయానికి వస్తామని చెప్పారు. రేవంత్ సర్కార్ కోర్టులను సైతం తప్పుదోవ పట్టిస్తోందని, కోర్టు సెలవు దినాలైన ఆదివారం తెల్లవారుజామున కూల్చివేతలు చేయడం ఏంటని ప్రశ్నించారు. బాధితులకు బీఆర్‌ఎస్ పార్టీ న్యాయ విభాగం అండగా ఉంటుందన్నారు. బంజారాహిల్స్‌లోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో బాధితులు సంప్రదించాలని.. లేదా స్థానిక కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలను సంప్రదించాలని సూచించారు.బీఆర్‌ఎస్ హయాంలో మొహరం, వినాయక చవితి, సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లు ఏవి జరిగినా కట్టుదిట్టమైన భద్రత కల్పించి ఎలాంటి గొడవలూ జరగకుండా చర్యలు తీసుకుందని గుర్తు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను కూడా సమర్థవంతంగా నిర్వహించలేకపోయిందని విమర్శించారు. ఈ పర్యటనలో ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మాగంటి గోపీనాథ్, మర్రి రాజశేఖర్‌రెడ్డి, కెవి.వివేకానంద, కాలేరు వెంకటేష్, మాజీ మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, కార్పొరేటర్‌లు పాల్గొన్నారు.