– ఐటీడీఏలో కలెక్టర్ సమీక్షా సమావేశం
నవతెలంగాణ-భద్రాచలం
గిరిజన మారుమూల ప్రాంతాల్లో మల్టీ స్పెషాలిటీ వైద్య క్యాంపులు నిర్వహణకు షెడ్యూలు తయారు చేయాలని కలెక్టర్ ప్రియాంక అలా వైద్యాధికారులకు సూచించారు. మంగళవారం ఐటిడిఏ కార్యాలయంలో పీఓ ప్రతీక్ జైన్‌తో కలిసి ఆర్ఓఎఫ్ ఆర్, గిరిజన విద్య, గురుకుల, గిరిజన ఇంజనీరింగ్ విభాగం, అంగన్వాడీ భవనాలు, సియం గిరి వికాసం, యువజన శిక్షణా కార్యక్రమాలు, జీసీసీ, వైద్య ఆరోగ్య శాఖ తదితర ఐటీడీఏ ద్వారా అమలు జరుగుతున్న కార్యక్రమాలపై నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయా శాఖల ద్వారా అమలు జరుగుతున్న పథకాల ప్రగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ మారుమూల గిరిజన గ్రామాల ప్రజల ఆరోగ్య పరిరక్షణ చర్యల్లో భాగంగా వచ్చే వారం మల్టి స్పెషాల్టి వైద్య క్యాంపులు నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఆరోగ్య కేంద్రాలు నిర్వహణలో ఆరోగ్య పరిరక్షణకు ప్రజలు పాటించాల్సిన ఆరోగ్య నియయాలను వివరించాలని చెప్పారు. 102, 108 అంబులెన్సులు వెళ్లడానికి రహదారి సౌకర్యం లేని గ్రామాల జాబితా అందచేయాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. మంచినీటి సౌకర్యం లేని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల జాబితా అందచేయాలని చెప్పారు. ఐటిడిఏ ద్వారా నిర్వహిస్తున్న పాఠశాలల్లో విద్యార్థుల సౌకర్యార్థం మౌలిక సదుపాయాలు కల్పనకు ప్రతిపాదనలు అందచేయాలని గిరిజన సంక్షేమ శాఖ డిడిని ఆదేశించారు. ప్రభుత్వ భూములు అందుబాటులో లేని కారణంగా 15 గ్రామ పంచాయతీలకు భవనాలు నిర్మాణానికి స్థల సమస్య ఏర్పడిందని, వీటి నిర్మాణానికి అటవీశాఖ ద్వారా స్థల సేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు. ఐటిడిఏ కార్యాలయ ప్రాంగణంలో డిజిటల్ ల్యాబ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు అందచేయాలని చెప్పారు. 21 వైకుంఠధామాల్లో నీటి సరఫరా కల్పనకు చర్యలు చేపట్టాలని సూచించారు. ట్రెకార్, యంఎస్ఎంఈ ద్వారా స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటుకు రుణాలు మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని ఎల్జియంకు సూచించారు. రుణాలు మంజూరు ప్రక్రియపై బ్యాంకు కంట్రోల్సు సమావేశం నిర్వహణకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. గిరిజన కళాకారులు తయారు చేసే హస్తకళలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పారు. రైతు ఉత్పత్తి సంఘాలు ద్వారా రైతులు ప్రాసెసింగ్ ఏర్పాటుతో ఆదాయం పెంచే మార్గాలను అన్వేషణ చేయాలని చెప్పారు. అనంతరం ఐటిడిఏ ప్రాంగణంలోని యూత్ ట్రైనింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. శిక్షణ పొందుతున్న విద్యార్థులో ముఖాముఖి నిర్వహించారు. శిక్షణలో మెలకువలు నేర్చుకుని, ఉపాధి రంగంలో రాణించాలని చెప్పారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఫోటోలు దిగారు. ఈ సమావేశంలో డిఆర్డిఓ మధుసూదన్ రాజు, సహాకార అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ శిరీష, వెంకటేశ్వరచారి, ఆర్సిఓ డేవిడ్ రాజు, గిరిజన సంక్షేమ శాఖ డిడి మణెమ్మ, ఎస్ఓ సురేష్ తదితరులు పాల్గొన్నారు.