పంట పొలాల్లోకి దూసుకెళ్లిన స్కూల్‌ బస్సు

A school bus rammed into the crop fields– 20 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలు
నవతెలంగాణ- మేడ్చల్‌
ఓ స్కూల్‌ బస్సు అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. దీంతో 20 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా బండమాదారం వద్ద సోమవారం జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్‌ పట్టణంలోని చాణిక్య విజన్‌ హైస్కూల్‌కు చెందిన బస్సు దాదాపు 30 మంది విద్యార్థులతో మధ్యాహ్నం 3.30 గంటలకు స్కూల్‌ నుంచి బయలుదేరింది. మార్గమధ్యలో గిర్మాపూర్‌, రాయిలాపూర్‌ గ్రామాల్లో విద్యార్థులను దింపేసింది. బండమాదారం గ్రామానికి వెళ్తుండగా మధ్యలో బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. డ్రైవర్‌ సత్యనారాయణ నిర్లక్ష్యంగా బస్సు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని భావించి అతనిపై ఒకరిద్దరూ తల్లిదండ్రులు దాడి చేసినట్టు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్ట్‌ నిర్వహించగా నెగిటీవ్‌ వచ్చింది. అయితే, బస్సు పొలాల్లోకి దూసుకెళ్లిన ప్రాంతంలో కరెంట్‌ పోల్‌ ఉంది. బస్సు స్తంభాన్ని ఢకొీడితే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. కానీ స్తంభం వద్దకు వచ్చి ఆగిపోవడంతో పిల్లలకు ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. సత్యనారాయణ రెగ్యులర్‌ డ్రైవర్‌ కాదని, టెంపరరీ డ్రైవర్‌ అని స్కూల్‌ యాజమాన్యం తెలిపింది. రెగ్యులర్‌ డ్రైవర్‌ సెలవులో ఉండటంతో సత్యనారాయణకు బస్సు ఇచ్చి పంపినట్టు తెలిపింది.
బస్సు కండిషన్‌లో లేదు : డ్రైవర్‌ సత్యనారాయణ
బస్సు స్టీరింగ్‌ తిప్పినా తిరగలేదని, అది కండీషన్‌లో లేదని డ్రైవర్‌ తెలిపారు. దాంతో పక్కనే ఉన్న పంట పొలాలకు మళ్లించానని చెప్పారు. బస్సు కండిషన్‌లో లేదని పాఠశాల యాజమాన్యానికి తెలిపినా పట్టించుకోలేదన్నారు.

Spread the love