– అక్కడికక్కడే చిన్నారి మృతి
– మేడ్చల్ మల్కాజిగిరి మల్లంపేట్ ఓక్ లీఫ్ హైస్కూల్‌లో ఘటన
నవతెలంగాణ-దుండిగల్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్లంపేట్‌లోని ఓ పాఠశాలలో తీవ్ర విషాద ఘటన జరిగింది. ఐదేండ్ల చిన్నారిపై నుంచి స్కూలు బస్సు వెళ్లడంతో విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డికి చెందిన ఓ కుటుంబం దుండిగల్ మున్సిపాల్టీలోని మల్లంపేట్‌లో డ్రీమ్ వ్యాలీలో నివసిస్తోంది. దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఇద్దరూ మల్లంపేట్‌లో గల ఓక్ లీఫ్ హైస్కూల్‌లో చదువుతున్నారు. చిన్న కుమార్తె మహాన్విత(5) ఒకటో తరగతి చదువుతున్నది. రోజూ మాదిరిగానే శుక్రవారం ఇద్దరు పిల్లలను స్కూల్ బస్సులో తల్లిదండ్రులు పంపించారు. అయితే, స్కూల్ ఆవరణలో బస్సు ప్రమాదవశాత్తు మహాన్వితపై నుంచి వెళ్లింది. వెంటనే ఆమెను మమత ఆస్పత్రికి తరలించగా అప్పటికే బాలిక మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.అయితే, బస్సు నుంచి జారి పడి మహాన్విత మృతి చెందినట్టు స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. దాంతో వారు అక్కడకు చేరుకుని స్కూల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సు డ్రైవర్‌ను అక్కడి నుంచి పంపించేశారని.. కేసును తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారని బంధువులు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. వాహనాన్ని సీజ్ చేశారు. చిన్నారి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. స్కూల్‌కు బస్సు చేరుకోగానే పిల్లలను కిందకు దించి క్లాస్ రూమ్‌కు తరలించే క్రమంలో డ్రైవర్ చూసుకోకుండా నడపడం వల్ల ప్రమాదం జరిగిందా లేక బస్సులో నుంచి జారి పడి చిన్నారి మృతిచెందిందా అనేది తెలియరాలేదు.