– పెద్దవంగర లో ఘటన
నవతెలంగాణ-పెద్దవంగర: విద్యార్థులతో వెళుతున్న పాఠశాల బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన పెద్దవంగర పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తొర్రూరు లోని లిటిల్ ప్లవర్ పాఠశాల కు చెందిన బస్సు గురువారం సాయంత్రం విద్యార్థులతో పెద్దవంగర కు వస్తుంది. పోలీస్ స్టేషన్ సమీపంలోకి రాగానే బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డు పక్క చెట్లలోకి దూసుకెళ్లింది. బస్సు స్టీరింగ్ రాడ్ విరగడంతో ప్రమాదం జరిగింది. ఆ సమయంలో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదంలో విద్యార్థులకు ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. బస్సులో 25 మంది విద్యార్థులు ఉన్నారు. విషయం తెలుసుకున్న పాఠశాల యాజమాన్యం మరో బస్సు ను తెప్పించి, విద్యార్థులను వారి ఇంటికి పంపించారు. ప్రమాదంపై విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏదైనా జరగరానిది జరిగితే బాధ్యులు ఎవరని పిల్లల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు? కాగా నిత్యం వందల వాహనాలు తిరిగే తొర్రూరు- వలిగొండ రహదారి విస్తరణ పనులు నత్తనడకన జరుగుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్డు గుంతల మాయం అయింది. దీంతో వాహనదారులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. వెంటనే రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలని మండల వాసులు కోరుతున్నారు.