వినోద రంగంలోనూ సంచలనమే..

వినోద రంగంలోనూ సంచలనమే..పాత్రికేయంతో తెలుగు ప్రజలపై చెరగని ముద్ర వేసిన ఈనాడుకు అనుబంధంగా ‘సితార’ సినిమా వారపత్రికను 1976లో ఆరంభించారు. విలువలు ఉన్న చిత్రాల్ని ప్రోత్సహించే దిశగానూ రామోజీరావు ఆలోచన చేశారు. ఆరోగ్యకరమైన వినోదాన్ని ప్రేక్షకులకు అందించాలనే సదుద్దేశంతో 1983లో ఉషాకిరణ్‌ మూవీస్‌ నిర్మాణ సంస్థను ప్రారంభించారు.
‘ప్రేమలేఖ’ నవలను జంధ్యాల దర్శకత్వంలో ‘శ్రీవారికి ప్రేమలేఖ’ పేరుతో సినిమాని తొలి సినిమాగా నిర్మించారు. విశేష ప్రేక్షకాదరణతో ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుని, ఉషాకిరణ్‌ సంస్థకు తొలి విజయాన్ని అందించింది.
నిజ జీవితం ఆధారంగా తెరకెక్కించిన ‘మయూరి’ సంచలన విజయం సాధించడం విశేషం. ప్రమాదంలో కాలును పోగొట్టుకుని, కృత్రిమ పాదంతో నాట్యంలో రాణించిన సుధా చంద్రన్‌ జీవితాన్ని మయూరిగా తెరపై ఆవిష్కరించడం ఓ విశేషమైతే, ఆ పాత్రలో సుధా చంద్రనే నటించడం మరో విశేషం.
ఒడిశాలో జరిగిన సంఘటన ఆధారంగా ‘మౌనపోరాటం’ చిత్రాన్ని నిర్మించారు. మగాడి చేతిలో మోసపోయిన ఓ వనిత పోరాటాన్ని అత్యంత ప్రభావ శీలంగా తెరకెక్కించారు. ఈ సినిమా సైతం అఖండ విజయాన్ని సాధించింది. దీని తర్వాత అదే స్థాయి విజయాన్ని సాధించిన చిత్రం ‘ప్రతిఘటన’.
సంఘ విద్రోహులతో పోరాడే తెగువ ఉన్న ఓ వనిత గాథను ఆవిష్కరించిన చిత్రమిది. అలాగే ఈ చిత్రంలోని పాటల్లోని సాహిత్యం సైతం మహిళ శక్తిని, ఆమె ఔచిత్యాన్ని తెలుపేలా ఉంటూ అందర్ని మెప్పించాయి. ఈ సినిమాలకు భిన్నంగా క్రీడాకారిణి అశ్విని నాచప్ప జీవితాన్ని ‘అశ్విని’ సినిమాగా మలిచి మరో విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ సంస్థపై నిర్మితమైన తేజ, మనసు మమత, అమ్మ, జడ్టిమెంట్‌, పీపుల్స్‌ ఎన్‌కౌంటర్‌ వంటి తదితర చిత్రాలు నాటి సమాజిక పరిస్థితులకు దర్పణం పట్టాయి. వీటికి పూర్తి భిన్నంగా ‘చిత్రం’, ‘నువ్వేకావాలి’, ‘ఆనందం’ వంటి తదితర యువతరం చిత్రాలు ఘన విజయాల్ని నమోదు చేసుకున్నాయి. కేవలం తెలుగు చిత్రాలకే పరిమితం కాకుండా ఇతర భాషల్లోనూ తీసి సత్తా చాటారు.
‘నాచే మయూరి’, ‘ప్రతిఘాత్‌’ చిత్రాలు బాలీవుడ్‌లోనూ విజయకేతనాన్ని ఎగురవేశాయి. కన్నడ, తమిళం, మరాఠి, ఇంగ్లీష్‌ వంటి తదితర భాషల్లో దాదాపు 87 చిత్రాలను నిర్మించారు.
‘నిన్ను చూడాలని’ సినిమాతో ఎన్టీఆర్‌ని హీరోగా పరిచయం చేశారు. శ్రీకాంత్‌, వినోద్‌కుమార్‌, చరణ్‌రాజ్‌, యమున, వరుణ్‌ రాజ్‌, ఉదరుకిరణ్‌, తరుణ్‌, రీమాసేన్‌, జెనీలియా, రితేష్‌ దేశ్‌ముఖ్‌, రిచా పల్లోడ్‌, మాధవీలతని నటీనటులుగా, గాయనిగా ఉన్న ఎస్‌. జానకిని ‘మౌనపోరాటం’ చిత్రంతో సంగీత దర్శకురాలిగా ప్రేక్షకులకు పరిచయం చేశారు.
1995వ సంవత్సరంలో ఈటీవీ ఛానల్‌ని ప్రారంభించారు. వినోద రంగాల్లోనూ తెలుగువారికి ఈటీవీ ప్లస్‌, ఈటీవీ సినిమా, ఈటీవీ అభిరుచి, ఈటీవీ లైఫ్‌, ఈటీవీ బాలభారత్‌ ఛానళ్ళను అందుబాటులోకి తీసుకొచ్చి ట్రెండ్‌ సెట్‌ చేశారు. ఇక రామోజీ ఆలోచనల నుంచి పుట్టిందే ‘పాడుతా తీయగా..’.
ఈ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులపై సుమధుర సంగీత జల్లు కురిపించారు. మల్లికార్జున్‌, ఉష, గోపికా పూర్ణిమ వంటి వందలమంది గాయనీగాయకులను సంగీత ప్రపంచానికి పరిచయం చేశారు. మయూరి అనే ఫిలిం డిస్ట్రిబ్యూషన్‌ ఆఫీసును కూడా మొదలుపెట్టి అనేక చిత్రాలను పంపిణీ చేశారు.
తొలి చిత్రం ‘శ్రీవారికి ప్రేమలేఖ’ నుంచే ప్రేక్షకుల మెప్పుతోపాటు ప్రభుత్వ పురస్కారాలూ వరించాయి. ‘కాంచనగంగ’, ‘మయూరి’, ‘ప్రతి ఘటన’, ‘తేజ’, ‘మౌన పోరాటం’ వంటి చిత్రాలకు నంది అవార్డులు దక్కగా, ‘మయూరి’లో నటించిన సుధాచంద్రన్‌కు జాతీయ స్థాయిలో అవార్డు లభించింది. ‘నువ్వే కావాలి’ చిత్రం జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా పురస్కారాన్ని సొంతం చేసుకుంది.
రామోజీ ఫిలిం సిటీని ప్రపంచంలోనే అతి పెద్ద సినిమా స్టూడియోగా నిర్మించారు. ఈ స్టూడియో గిన్నిస్‌ బుక్‌ రికార్డుల్లోకి ఎక్కింది. అంతేకాదు ఇదొక పర్యాటక ప్రాంతంగా విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది.
యు.విశ్వేశ్వరరావు దర్శ కత్వంలో వచ్చిన ‘మార్పు’ అనే సినిమాలో రామోజీరావు న్యాయమూర్తి పాత్ర పోషించారు.
ఆదివారం షూటింగ్‌లు బంద్‌
రామోజీరావు మృతికి సంతాప సూచకంగా ఆదివారం చిత్ర పరిశ్రమ బంద్‌కు చలన చిత్ర నిర్మాతల మండలి పిలుపునిచ్చింది. షూటింగ్‌లతోపాటు సినిమాకి సంబంధించి అని కార్యకలాపాలను నిలిపివేయనున్నారు.
రామోజీరావు..
పత్రికాధిపతిగా, వ్యాపారవేత్తగానే కాకుండా ఉత్తమాభిరుచిగల నిర్మాతగా, స్టూడియో నిర్వాహకులుగా బహుముఖంగా విజయాలు సాధించారు. మిగిలిన రంగాలతోపాటు వినోద రంగంలోనూ సంచలనాలు సృష్టించారు. సినిమాలంటే కదిలే బొమ్మలు మాత్రమే కాదు మనసుల్ని కదలించే బొమ్మలనే విశ్వాసాన్ని ఆచరణలో పెడుతూ ఆయన నిర్మించిన పలు చిత్రాలు ప్రేక్షకుల ఆదరణతో సంచలన విజయాలను సాధించాయి. వినోదంతోపాటు మహిళా శక్తి, మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తూ నిజ జీవిత కథలను, వాస్తవ ఘటనలను వెండితెరపై ఆవిష్కరించి అఖండ విజయాలను సొంతం చేసుకున్నారు. అటు వెండితెరపై, ఇటు బుల్లితెరపై తనదైన చెరగనిముద్ర వేయడంతోపాటు ప్రపంచంలోనే అత్యంత పెద్ద స్టూడియోగా రామోజీ ఫిల్మ్‌ సిటీని స్థాపించి వినోద ప్రపంచంలోనూ రారాజే అనిపించుకున్న రామోజీరావు సినీ జీవిత ప్రయాణంలోని కొన్ని విశేషాలు..
తల వంచని మేరు పర్వతం
ఈనాడు గ్రూప్‌ సంస్థల చైర్మన్‌ రామోజీరావు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. సినీ రంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడుతూ ఆయనతో తమకి ఉన్న అనుబంధాన్ని సోషల్‌ మీడియా వేదికగా గుర్తు చేసుకున్నారు.
నా గురువు, శ్రేయోభిలాషి రామోజీరావు మరణవార్త నన్ను ఎంతగానో బాధించింది. జర్నలిజం, సినిమా రంగాల్లో చరిత్ర సష్టించారు.
– రజనీకాంత్‌
రామోజీ ఫిల్మ్‌ సిటీ ఓ అద్భుతం. అది షూటింగ్‌ లొకేషన్‌ మాత్రమే కాదు, ప్రముఖ పర్యాట కేంద్రంగా కూడా ఆదరణ పొందుతోంది. అంత దూరదృష్టి, వినూత్న ఆలోచనాపరుడు మరణించడం సినీ పరిశ్రమకు తీరని లోటు.
– కమల్‌హాసన్‌
ఎవరికీ తలవంచని మేరు పర్వతం దివికేగింది. – చిరంజీవి
రామోజీరావు మహోన్నత వ్యక్తి. పత్రికా రంగంలో రారాజు. ఆయన విజన్‌, ఆలోచనా విధానం చాలా గొప్పది. – మోహన్‌బాబు
తెలుగు నుడికారానికి ఒక కొత్త కళను తెచ్చారు. జర్నలిజానికి కొత్త సొబగును దిద్దారు. చిత్రసీమలో అదే తీరున సాగి ఉషోదయ కిరణాలను ప్రసరింపజేశారు. – బాలకృష్ణ
రామోజీరావు నిజమైన దార్శనికుడు, భారతీయ మీడియాలో ఆయన విప్లవాత్మక కషి చేశారు. జర్నలిజం, సినీ రంగంలో ఆయన చేసిన కషి ఎంతోమందికి స్ఫూర్తి. – వెంకటేష్‌
రామోజీరావు గొప్ప దార్శనికుడు. ఎంచుకున్న ప్రతి రంగంలోనూ విజయాలను అందుకున్నారు. – నాగార్జున
సినీ నిర్మాతగా, స్టూడియో నిర్వాహకులుగా, వ్యాపారవేత్తగా, మీడియా మోఘల్‌గా అలుపెరగని పోరాటం చేశారు. – పవన్‌కళ్యాణ్‌
ఎంతో ముందు చూపు ఉన్న గొప్ప వ్యక్తి రామోజీరావు. సినిమాపై ఆయనకి ఉన్న అభిరుచికి రామోజీ ఫిల్మ్‌ సిటీ ఓ నిదర్శనం. – మహేష్‌బాబు
‘నిన్ను చూడాలని’తో నన్ను తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం చేసినప్పటి జ్ఞాపకాలు ఎప్పటికీ మరువలేను. – ఎన్టీఆర్‌
నేను గౌరవించే స్ఫూర్తిదాయక వ్యక్తుల్లో రామోజీరావు ఒకరు. మీడియా, సినిమా, ఇతర రంగాలకు ఆయన చేసిన సేవలు మరువలేనివి.
– అల్లు అర్జున్‌
ఒక మనిషి అనేక రంగాల్లో వివిధ సంస్థలు స్థాపించి వాటిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు. భారతరత్నతో ఆయనను సత్కరించడమే మనమిచ్చే ఘనమైన నివాళి. – దర్శకుడు రాజమౌళి

Spread the love