జైపూర్ ను కుదిపేసిన వరుస భూకంపాలు..

earthquakes-hit-jaipurనవతెలంగాణ – రాజస్థాన్
రాజస్థాన్ జైపూర్ ను వరుస భూకంపాలు కుదిపేశాయి. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో భూమి కంపించింది. అరగంట వ్యవధిలోనే మూడు భూకంపాలు సంభవించాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ  ప్రకారం.. మూడు భూకంపాలు కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే సంభవించాయి. మొదటి భూకంపం ఉదయం 04:09 గంటలకు సంభవించగా.. రిక్టరు స్కేలుపై దాని తీవ్రత 4.4 గా నమోదైంది. ఆ తర్వాత 4:22 గంటల ప్రాంతంలో మరోసారి భూమి కంపించింది. రెండో సారి రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 3.1గా నమోదైంది. ఆ వెంటనే మూడు నిమిషాలకే అంటే 4:25కి మరోసారి భూ ప్రకంపనలు సంభవించాయి. మూడోసారి రిక్టరు స్కేలుపై 3.4 తీవ్రతగా నమోదైంది. వరుస భూకంపాలతో గాఢనిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచారు. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే భూకంపం తీవ్రత తక్కువగా ఉండటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందనే విషయంపై ప్రస్తుతం స్పష్టత లేదు. కాగా భూప్రకంపనలకు సంబంధించిన దృశ్యాలను ప్రజలు సోషల్​ మీడియాలో షేర్​ చేశారు. మరోవైపు అరగంట వ్యవధిలోనే భూమి మూడు సార్లు కంపించడంపై రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే స్పందించారు. ‘జైపూర్‌ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. మీరందరూ (ప్రజలు) క్షేమంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను!’ అంటూ ట్వీట్ చేశారు.

Spread the love