ఇంగ్లాండ్‌కు ఎదురుదెబ్బ!

ఇంగ్లాండ్‌కు ఎదురుదెబ్బ!– గాయంతో జాక్‌ లీచ్‌ దూరం
రాజ్‌కోట్‌ : భారత్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. గాయాలతో టీమ్‌ ఇండియా ఇప్పటివరకు కీలక ఆటగాళ్ల సేవలను కోల్పోగా.. ఇప్పుడు ఇంగ్లాండ్‌ వంతు!. ఇంగ్లాండ్‌ సీనియర్‌ స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌ మోకాలి గాయంతో భారత్‌తో చివరి మూడు టెస్టులకు దూరమయ్యాడు. ఈ మేరకు ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు ఆదివారం తెలిపింది. హైదరాబాద్‌ టెస్టులో ఫీల్డింగ్‌ చేస్తూ జాక్‌ లీచ్‌ మోకాలి గాయానికి గురయ్యాడు. జాక్‌ లీచ్‌ గాయంతోనే హైదరాబాద్‌ టెస్టులో బౌలింగ్‌ చేశాడు. కానీ విశాఖపట్నం టెస్టుకు దూరంగా ఉన్నాడు. సిరీస్‌లో విరామ సమయంలో జట్టుతో పాటు అబుదాబి (యుఏఈ) చేరుకున్న జాక్‌ లీచ్‌.. అక్కడ వైద్య పరీక్షల అనంతరం డాక్టర్ల సూచనల మేరకు స్వదేశానికి పయనం కానున్నాడు. ‘జాక్‌ లీచ్‌ అబుదాబి నుంచి స్వదేశానికి 24 గంటల్లో పయనం అవుతాడు. రాజ్‌కోట్‌ టెస్టు ముంగిట ప్రస్తుతం ఇంగ్లాండ్‌ జట్టు అబుదాబిలో బస చేస్తుంది. జాక్‌ లీచ్‌ ఫిట్‌నెస్‌, రిహాబిలిటేషన్‌ను ఇంగ్లాండ్‌, సోమర్‌సెట్‌ వైద్య బృందాలు సంయుక్తంగా పర్యవేక్షిస్తాయి’ అని ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) ఓ ప్రకటనలో వెల్లడించింది. జాక్‌ లీచ్‌ స్థానంలో మరో స్పిన్నర్‌ను ఇంగ్లాండ్‌ సెలక్టర్లు ఇంకా ఎంపిక చేయలేదు. టామ్‌ హర్ట్‌లీ, రెహాన్‌ అహ్మద్‌, షోయబ్‌ బషీర్‌ సహా జో రూట్‌ రూపంలో ఇంగ్లాండ్‌కు నలుగురు స్పిన్నర్లు అందుబాటులో ఉన్నారు. అబుదాబి నుంచి బెన్‌స్టోన్స్‌ సేన సోమవారం రాజ్‌కోట్‌కు చేరుకోనుంది. మంగళవారం ఇంగ్లాండ్‌ క్రికెటర్లు తొలి ప్రాక్టీస్‌ సెషన్లో పాల్గొననున్నారు. గురువారం నుంచి నిరంజన్‌ షా స్టేడియంలో భారత్‌, ఇంగ్లాండ్‌ మూడో టెస్టు ఆరంభం కానుంది.

Spread the love