ఏడేళ్ల బాలికను 4.50 లక్షలకు విక్రయం..

నవతెలంగాణ-హైదరాబాద్ : రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ జిల్లాలో జరిగిన ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏడేళ్ల బాలికను రూ. 4.50 లక్షలకు కొనుగోలు చేసిన ఓ కుటుంబం 38 ఏళ్ల వ్యక్తితో పెండ్లి జరిపించింది. జిల్లాలోని మానియా ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూపాల్ సింగ్ కుటుంబం బాధిత బాలికను ఆమె తండ్రి నుంచి రూ. 4.50 లక్షలకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత భూపాల్‌సింగ్‌తో ఈ నెల 21న వివాహం జరిపించింది. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ హత్య కేసులో కుటుంబ సభ్యులు కొందరు జైలు శిక్ష అనుభవించిన తర్వాత నిందితుడి కుటుంబం మానియాలో స్థిరపడినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. బాలికను కొనుగోలు చేసి తీసుకొచ్చి పెద్ద వయసు వ్యక్తితో వివాహం జరిపించినట్టు పోలీసులకు మంగళవారం సమాచారం అందింది. అప్రమత్తమైన పోలీసులు నిందితుడి ఇంటిపై దాడిచేసి బాలికను రక్షించారు. పెండ్లి కుమార్తెకు వేసినట్టు ఆమె చేతులు, కాళ్లను హెన్నాతో అలంకరించినట్టు పోలీసులు గుర్తించారు. బాలికను రూ. 4.50 లక్షలకు విక్రయించినట్టు ఆమె తండ్రి అంగీకరించినట్టు పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనలో ఉన్న వారి ప్రమేయంపై ఆరా తీస్తున్నారు.

Spread the love