హైద‌రాబాద్ క్రికెట్ సంఘానికి షాక్…

నవతెలంగాణ – హైదరాబాద్
భార‌త క్రికెట్ బోర్డు తాజాగా హైద‌రాబాద్ క్రికెట్ సంఘానికి షాకిచ్చింది. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ షెడ్యూల్ మార్చే ప్ర‌స‌క్తే లేద‌ని స్ఫ‌ష్టం చేసింది. మెగా టోర్నీ ఆరంభానికి స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డింద‌ని, ఈ ప‌రిస్థితుల్లో షెడ్యూల్ మార్చ‌డం కుద‌ర‌ని తేల్చి చెప్పింది. దాంతో, ప్ర‌పంచ క‌ప్ మ్యాచ్‌ల తేదీ మార్పుల‌పై కొండంత ఆశ పెట్టుకున్న‌ హెచ్‌సీఏ పెద్ద‌ల‌కు నిరాశే మిగిలింది. హైద‌రాబాద్‌లోని ఉప్ప‌ల్ స్టేడియం ఈసారి ప‌లు మ్యాచ్‌ల‌కు ఆతిథ్యం ఇస్తోంది. అయితే.. అక్టోబ‌ర్ 9న‌, అక్టోబ‌ర్ 10న వ‌రుస తేదీల్లో రెండు మ్యాచ్‌లు ఉండ‌డంపై హెచ్‌సీఏ అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. ఆట‌గాళ్లు మ్యాచ్ ప్రాక్టీస్ చేసేందుకు అవ‌కాశం ఉండ‌ద‌ని, ఒక మ్యాచ్ తేదీని మార్చాల‌ని బీసీసీఐని కోరింది. కానీ, రోజ‌ర్ బిన్ని నాయ‌క‌త్వంలోని భార‌త క్రికెట్ బోర్డు స‌సేమిరా అంది. ‘వ‌రుస తేదీల్లో రెండు మ్యాచ్‌ల విష‌య‌మై బీసీసీఐ పెద్ద‌ల‌తో చ‌ర్చించాం. కానీ, టోర్నీకి స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డినందున ఇప్పుడు మార్పులు సాధ్యం కాద‌ని తేల్చి చెప్పారు. అందుక‌ని మేము వాళ్ల‌కు స‌హ‌క‌రించాల‌ని నిర్ణ‌యించుకున్నాం’ అని సుప్రీం కోర్టు నియ‌మించిన స‌భ్యుడు దుర్గా ప్ర‌సాద్ వెల్ల‌డించాడు.

Spread the love