– ఢిల్లీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఆప్ విజయం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీకి షాక్ తగిలింది. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించింది. ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్ మహేశ్ కుమార్ ఖించి ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఢిల్లీ మూడో మేయర్‌గా రికార్డు సృష్టించారు. కరోల్‌బాగ్‌లోని దేవ్‌నగర్ కౌన్సిలర్‌గా ఉన్న మహేశ్ ఖించికి 133 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి కిషన్‌లాల్‌కు 130 ఓట్లు వచ్చాయి. దీంతో స్వల్ప మెజార్టీతో ఆప్ అభ్యర్థి గెలిచారు. మొత్తంగా 265 ఓట్లు పోలవ్వగా.. రెండు ఓట్లు (బీజేపీ 1, ఆప్ 1) చెల్లనివిగా అధికారులు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ఆప్ ఎంపీలు సంజరు సింగ్, ఎన్‌డీ గుప్తా, బీజేపీకి చెందిన ఏడుగురు ఎంపీలు ఓటు వేశారు.
డిప్యూటీ మేయర్‌గా రవీందర్ భరద్వాజ్ ఏకగ్రీవ ఎన్నిక
మేయర్ ఎన్నికల్లో పరాజయంతో బీజేపీ డిప్యూటీ మేయర్ రేసు నుంచి వైదొలగింది. దీంతో ఆప్ కౌన్సిలర్ రవీందర్ భరద్వాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.తొలుత బీజేపీ నుంచి డిప్యూటీ మేయర్ పదవికి నీతా బిస్త్ బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో ఎనిమిది మంది ఆప్ కౌన్సిలర్లు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. ఎన్నికల్లో జాప్యం, ఆప్ దళిత వ్యతిరేక పార్టీ అని మండిపడుతూ ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు ఎన్నికలను బహిష్కరించారు. ఎన్నిక సమయంలోనే నాటకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్ కౌన్సిలర్ సబిలా బేగం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆమె కాంగ్రెస్‌కు రాజీనామా చేసినట్టు ఆమె భర్త సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించారు. వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్‌లోనే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ.. ఆప్, బీజేపీ మధ్య పోరుతో పాటు పలు కారణాల రీత్యా వాయిదా పడుతూ వచ్చాయి. దీంతో కొత్త మేయర్, డిప్యూటీ మేయర్ ఐదు నెలలు మాత్రమే ఈ పదవుల్లో కొనసాగే అవకాశం ఉంది.