నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికాలో కోడిగుడ్ల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇటీవల వీటి ధరలు 15శాతం పెరగ్గా.. ఈ ఏడాదిలో మరో 20శాతం పెరిగే అవకాశాలున్నట్లు అంచనా. దేశవ్యాప్తంగా వీటి లభ్యత భారీగా తగ్గడమే ఇందుకు కారణం. అనేక స్టోర్లలో ‘లిమిటెడ్ స్టాక్’ బోర్డులే కనిపిస్తుండగా.. కొన్ని చోట్ల ‘నో ఎగ్స్’ బోర్డులు దర్శనమిస్తుండటం గమనార్హం. దీంతో గుడ్ల విక్రయంపై పరిమితి విధిస్తున్న స్టోర్లు ఒక్కరికి గరిష్ఠంగా రెండు, మూడు ట్రేలు మాత్రమే ఇస్తున్నాయి.
అమెరికాలో కొంతకాలంగా బర్డ్ ఫ్లూ వ్యాప్తి పెరిగింది. దీంతో గతేడాది ఒక్క డిసెంబర్‌లోనే సుమారు 2.3కోట్ల కోళ్లను వధించినట్లు అమెరికా వ్యవసాయశాఖ గణాంకాలు పేర్కొన్నారు. ఒహాయో, మిస్సౌరీలలో దీని ప్రభావం అధికంగా కనిపిస్తోంది. అమెరికా లేబర్ బ్యూరో లెక్కల ప్రకారం.. గతేడాది జనవరిలో డజను కోడిగుడ్ల ధర 2.52డాలర్లుగా ఉండగా.. డిసెంబర్ నాటికి అది $4.15లకు పెరగగా, ఇప్పుడది 7.34 డాలర్లుకు చేరింది. రానున్న రోజుల్లోనూ మరింత ప్రియమయ్యే సూచనలు కనిపిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.