– జీన్ డ్రేజ్, అన్నీ రాజాను అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలుపుతూ మౌన ప్రదర్శన చేస్తున్న ఆర్థికవేత్త జీన్ డ్రేజ్, సీపీఐ నాయకుడు అన్నీ రాజా సహా ప్రముఖ కార్యకర్తలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిరసన గురించి కార్యకర్తలు పోలీసులకు సమాచారమందించి నప్పటికీ అరెస్ట్ చేయటం గమనార్హం. గాజాలో తక్షణ కాల్పుల విరమణను డిమాండ్ చేస్తూ.. పాలస్తీనా కోసం వీరు నిర్వహించిన మార్చ్.. ఖాన్ మార్కెట్ ప్రాంతం నుంచి ప్రారంభమై ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వైపు వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ”మేము నినాదాలు కూడా చేయలేదు. కానీ బ్యానర్లతో నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాం. కానీ దురదృష్టవశాత్తు, పోలీసులు మమ్మల్ని అదుపులోకి తీసుకున్నారు”’ అని డ్రేజ్ అన్నారు. పాలస్తీనాపై దాడులను ప్రారంభించిన ఇజ్రాయెల్‌తో అన్ని సంబంధాలనూ వెంటనే ముగించాలని భారత ప్రభుత్వాన్ని కోరిన సామాజికవేత్తలు, కార్యకర్తలు ఈ నిరసనకు హాజరయ్యారు. భారతదేశం సంతకం చేసి, ఆమోదించిన జెనోసైడ్ కన్వెన్షన్ ప్రకారం మారణహౌమాన్ని నిరోధించటానికి భారత్ అన్ని చర్యలనూ తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.