సాదాసీదాగా సర్వసభ్య సమావేశం

– గంటన్నర ఆలస్యంగా సమావేశం ప్రారంభం
– నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం
– రూ.18 కోట్ల 90 లక్షలతో చెరువు కట్ట సుందరీకరణ
– ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి
– ఇ.పట్నం మండల సర్వసభ్య సమావేశం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ఇబ్రహీంపట్నం మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం సాదాసీదాగా సాగింది. సుమారు గంటన్నర ఆలస్యంగా సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో పలు శాఖలపై సభ్యులు చర్చించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఇబ్రహీంపట్నం మండలానికి వివిధ అభివద్ధి కార్యక్రమాల కోసం కోటీ రూపాయలు మంజూరు చేయనున్నట్టు హామీ ఇచ్చారు. ఇబ్రహీంపట్నం చెరువు కట్ట సుందరీకరణకు రూ.18కోట్ల 90లక్షలు మంజూరైనట్టు వివరించారు. దాంతో మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం సాదాసీదాగా సాగింది. ఇబ్రహీంపట్నం ఎంపీపీ పి.కృపేష్‌ అధ్యక్షతన మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి హాజరయ్యారు. పలు శాఖలపై సభ్యులు చర్చించారు. ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో ఆయిల్‌ ఫామ్‌ సాగును ప్రోత్సహిస్తున్నామని సంబంధిత అధికారి కనుకలక్ష్మీ తెలిపారు. మండలంలో 47ఎకరాల్లో ఏడుగురు రైతులు సాగు చేసుకునేందుకు ముందుకు వచ్చినట్టు చెప్పారు. అదే విధంగా 42మంది రైతులు ఉపాధిహామీ ద్వారా 100ఎకరాల్లో పలు రకాల పండ్ల తోటలను సాగు చేసుకునేందుకు గుర్తించామని చెప్పారు. వీరికి ప్రభుత్వం 90శాతం సబ్సిడీపై మొక్కలను సరఫరా చేస్తుందని గుర్తు చేశారు. ఇంకా అవసరం ఉన్న రైతులు జాతీయ గ్రామీణ ఉపాధిహామీ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం పంచాయతీరాజ్‌ శాఖపై జరిగిన చర్చలో గత మూడు మాసాల క్రితం మంజూరైన రూ.2కోట్ల అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తి చేశామని ఏఈ ఇంద్ర సేనారెడ్డి అన్నారు. మరో రూ.5కోట్ల నిధులు అభివృద్ధి పనులు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. డీఎంఎఫ్‌, ఎస్‌డీఎఫ్‌ వంటి నిధులు ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి విరివిగా వస్తున్నాయని చెప్పారు. విద్యుత్‌శాఖపై జరిగిన చర్చలో పెద్దతుండ్ల గ్రామానికి ప్రత్యేక విద్యుత్తు లైను వేయాలని మూడు సంవత్సరాలుగా కోరుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని సర్పంచ్‌ యాదగిరి ఆందోళన వ్యక్తం చేశారు. మూడు సంవత్సరాల్లో 30సార్లు అధికారులు కలిసినా.. బడ్జెట్‌ రావడం లేదన్న సాకుతో తిప్పించుకుంటున్నారని ఆందోళన వెలిబుచ్చారు. అయితే ఇదే విషయమే ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి జోక్యం చేసుకుని మాట్లాడుతూ ఆ మార్గంలో లైన్‌ వేసేందుకు వేసిన విద్యుత్తు స్తంభాలు ఎందుకు తీసుకెళ్లారని ప్రశ్నించారు. సంబంధిత అధికారి పొంతనలేని సమాధానం చెబుతున్నాడంతో ఎమ్మెల్యే ఒక్కసారిగా మందలించారు. అందుకు సంబంధించిన విద్యుత్‌ స్తంభాలు ఎక్కడ తీసుకెళ్లారు? ఎవరు తీసుకెళ్లారు? ఎందుకు తీసుకెళ్లారు అన్న వివరాలు తన ముందుంచాలని ఆదేశించారు. ఆ మార్గంలో లైన్‌ వేయడానికి రూ.12లక్షల నిధుల అవసరం ఉంటుందని అందుకోసం ప్రతిపాదన పంపినట్లు ఏఈ సూచించారు. వ్యవసాయ కనెక్షన్ల కోసం వేసిన పురాతన విద్యుత్తు లైను కిందికి వేలాడుతున్న ఎందుకు సరి చేయడం లేదని ఉప్పరిగూడ సర్పంచ్‌ బూడిద రాంరెడ్డి అధికారులను ప్రశ్నించారు. ఎన్నిసార్లు చెప్పాలని నిలదీశారు. అందుకు ప్రత్యేకలైన్‌ వేయాల్సి ఉంటుందని అధికారులకు సూచించారు. విద్యార్థులకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించాలని పోల్కంపల్లి సర్పంచి చెరుకూరి అండాలు విద్యాధికారిని కోరారు. సబ్జెక్టు టీచర్‌ లేకపోవడం వల్ల తల్లిదండ్రుల తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపేందుకు శ్రద్ధ చూపడం లేదన్నారు. గ్రామీణ ప్రాంతంలో కోతుల బెడద ఎక్కువగా ఉందని పాఠశాలల వద్దకు వచ్చి పిల్లలపై దాడులకు పూనుకుంటున్నాయని నివారణ చర్యలు చేపట్టాలని సర్పంచ్‌ కోరారు. దాంతో మండల వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని సర్పంచ్‌లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అంతే కాకుండా కుక్కల బెడద కూడా అధికంగా ఉందని సభ్యులు సూచించారు.
చెరువు కట్ట సుందరీకరణకు రూ.18. 90 కోట్లు
ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి అధిక నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పదంలో నడిపిస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి చెప్పారు. ఇబ్రహీంపట్నం చెరువు కట్ట సుందరీ కరణ కోసం రూ.18 కోట్ల 90 లక్షలు మంజూరు చేయించామని, ఆ పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. ఇబ్రహీంపట్నం మండలానికి నెల రోజుల వ్యవధిలో మరో కోటి రూపాయలను వెచ్చిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటి వరకు తక్కువ మోతాదులో నిధులు వెచ్చించిన గ్రామపంచాయతీలకు ఈ నిధులు కేటాయించాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి పథంలో పయనిస్తాయన్నారు. ప్రజల కోరిక మేరకు ప్రజాప్రతినిధులు పని చేయాలన్నారు. సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పారు. దళిత బంధు, బీసీ బందు సత్పలితాలు ఇస్తుందన్నారు. పేదల ఆర్థిక స్తోమతను పెంచేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుందన్నారు. నియోజకవర్గంలో 79 గ్రామపంచాయతీలుంటే, వాటిలో ప్రతి పంచాయతీకి రూ. కోట్లకు పైగా అభివృద్ధి పనులు జరిగాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పి. కృపేష్‌, మండల పరిషత్‌ ఉపాధ్యక్షులు మంచిరెడ్డి ప్రతాపరెడ్డి, ఎంపీడీవో వెంకటమ్మ, దండుమలారం సొసైటీ చైర్మన్‌ వెంకట్‌ రెడ్డి, పంచాయతీరాజ్‌ డివిజనల్‌ అధికారి శ్రీనివాసరెడ్డి, మండల విద్యాధికారి వెంకట్‌ రెడ్డి, ఏఈ ఇంద్రసేనారెడ్డి, సంక్షేమశాఖాధికారి కుసుమలావణ్య, సువర్ణ, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Spread the love