– 0.7 శాతం ఓట్ల తగ్గుదలతో 63 సీట్లు కోల్పోయిన బీజేపీ
– 1.7 శాతం ఓట్ల పెరుగుదలతో సెంచరీకి చేరువైన కాంగ్రెస్
న్యూఢిల్లీ : ఓట్లకు, సీట్లకు ఏ మాత్రం సంబంధం ఉండదని లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మరోసారి నిరూపించాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి దేశవ్యాప్తంగా 37.3 శాతం ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఆ పార్టీ పొందిన ఓట్ల శాతం 36.6 శాతం. గతంలో కంటే స్వల్పంగానే ఓటింగ్ శాతం తగ్గినప్పటికీ బీజేపీ ఏకంగా 63 స్థానాలు కోల్పోవడం గమనార్హం. 2019లో 303 స్థానాలు గెలుచుకున్న కమలదళం ఇప్పుడు 240కే పరిమితమైంది. ఫలితంగా సొంత బలంపై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని కోల్పోయింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తన ఓటింగ్‌ను 19.5 శాతం నుంచి 21.2 శాతానికి, సీట్ల సంఖ్యను దాదాపు రెట్టింపునకు…అంటే 52 నుంచి 99కి పెంచుకుంది.
ఓటింగ్ శాతంలో స్వల్ప తేడా ఉన్నప్పటికీ సాధించిన సీట్ల సంఖ్యలో మాత్రం భారీ వ్యత్యాసం కన్పిస్తోంది. ఇలా ఎందుకు జరుగుతుంది? ఏదైనా పార్టీ ఒక రాష్ట్రంలో ఎక్కువ ఓట్ల శాతాన్ని పొందిందనుకోండి. గతంలో ఆ రాష్ట్రంలో పార్టీకి పెద్దగా ఓట్లు లేకుంటే ఇప్పుడు అవి పెరిగినా సీట్ల సంఖ్యలో మార్పు కన్పించదు. అదే బాగా పోటీ ఉన్న రాష్ట్రాల్లో ఓట్ల శాతం తగ్గితే సీట్లు కూడా భారీగానే కోల్పోవచ్చు.
బీజేపీ ఫలితాలు ఇలా…
ఉదాహరణకు తమిళనాడులో బీజేపీ ఓటింగ్ 3.6 శాతం నుంచి ఒక్కసారిగా 11.2 శాతానికి పెరిగింది. కానీ ఆ రాష్ట్రంలో పార్టీకి ఒక్క సీటూ రాలేదు. అదే విధంగా పంజాబ్‌లో కూడా ఓటింగ్ 9.6 శాతం నుంచి 18.6 శాతానికి పెరిగింది. అయితే అక్కడ భాగస్వామ్య పక్షాలేవీ లేకపోవడంతో సీట్లు పొందలేకపోయింది. పైగా గతంలో ఉన్న రెండు స్థానాలనూ కోల్పోయింది.
మరో కోణంలో చూస్తే బీహార్‌లో బీజేపీ మూడు శాతం ఓట్లను కోల్పోయింది. దాని ఓటింగ్ 23.6 శాతం నుంచి 20.5 శాతానికి పడిపోయింది. ఫలితంగా ఆ పార్టీ ఐదు స్థానాలు చేజార్చుకుంది. పశ్చిమ బెంగాల్‌లో కేవలం 1.6 శాతం ఓట్లు తగ్గడం వల్ల ఆరు స్థానాలు వదులుకోవాల్సి వచ్చింది. మహారాష్ట్రలో అత్యంత నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. అక్కడ బీజేపీ ఓటింగ్ కేవలం 1.4 శాతం మాత్రమే (27.6 శాతం నుంచి 26.2 శాతానికి) తగ్గింది. కానీ గతంలో గెలుచుకున్న స్థానాల్లో సగం ప్రత్యర్థులకు దక్కాయి. 2019లో 23 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఇప్పుడు 10 స్థానాలకే పరిమితమవ్వాల్సి వచ్చింది.
కాంగ్రెస్ ఫలితాలు అలా…
కాంగ్రెస్ పార్టీ దీనికి భిన్నమైన ఫలితాలు పొందింది. మహారాష్ట్రలో ఆ పార్టీకి ఒక శాతం కంటే తక్కువ ఓట్లే పెరిగాయి. కాంగ్రెస్ ఓటింగ్ 16.3 శాతం నుంచి 17.1 శాతానికే పెరిగినప్పటికీ దాని సీట్లు మాత్రం ఒకటి నుండి 13కి చేరాయి. రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటింగ్ 34.2 శాతం నుంచి 37.9 శాతానికి పెరిగింది. అంతకుముందు ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఒక్క సీటూ లేదు. ఇప్పుడు ఏకంగా ఎనిమిది స్థానాలను సొంతం చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ ఓటు షేర్ 6.3 శాతం నుంచి 9.5 శాతానికి పెరగ్గా సీట్ల సంఖ్య ఒకటి నుండి ఆరుకు చేరుకుంది.
సమాజ్‌వాదీకి…
లోక్‌సభలో మూడో అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించిన సమాజ్‌వాదీ పార్టీ యూపీలో తన ఓటింగ్‌ను 18 శాతం నుంచి 33.5 శాతానికి పెంచుకుంది. గతం లో ఎన్నడూ లేనంతగా దిగువసభలో 37 సీట్లు పొందింది. యూపీలో కాంగ్రెస్‌కు వచ్చిన 9 శాతం ఓట్లను కలుపుకుంటే ఇండియా బ్లాక్‌కు 43 శాతం ఓట్లు లభించాయి. ఫలితంగా ఎన్డీఏతో నువ్వా నేనా అనే రీతిలో పోరు జరిగింది. గత ఎన్నికల్లో సమాజ్‌వాదీ, బీఎస్పీ జట్టు కట్టి 37.3 శాతం ఓట్లు పొందాయి. ఎన్డీఏకు 50 శాతానికి పైగా ఓట్లు రావడంతో కూటమికి ప్రయోజనం దక్కలేదు. ఇప్పుడు కూటమిలో బీఎస్పీ లేకపోయినా ఎస్పీ-కాంగ్రెస్ జోడీ సత్తా చాటింది.