భాక్రా కెనాల్ లో పడిపోయిన యువతి.. కాపాడిన సైనికుడు

నవతెలంగాణ – పంజాబ్: ప్రమాదవశాత్తు కాలువలో పడి కొట్టుకుపోతున్న ఓ యువతిని ఆర్మీ జవాను ప్రాణాలకు తెగించి కాపాడారు. కెనాల్ ఉధృతంగా ప్రవహిస్తున్నా లెక్క చేయకుండా అందులోకి దూకి అమ్మాయిని రక్షించారు. పంజాబ్ లోని పాటియాలాలో ఆదివారం జరిగిందీ ఘటన.పాటియాలాలోని భాక్రా కెనాల్ ఎప్పుడూ ఉధృతంగా ప్రవహిస్తుంటుంది. అయితే ఓ యువతి ప్రమాదవశాత్తు ఆ కాలువలో పడి కొట్టుకుపోసాగింది. ఆమెను గమనించిన జవాన్‌ డీఎన్‌ క్రిష్ణన్‌.. వెంటనే నీటిలోకి దూకేశారు. యువతిని పట్టుకుని బయటికి తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ప్రవాహం ఉధృతంగా ఉండటంతో సాధ్యపడలేదు.  స్థానికులు గమనించి బయటి నుంచి జవానుకు తాళ్లు అందించారు. వాటి సాయంతో యువతిని జవాను ఒడ్డుకు తీసుకొచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. సైనికుడు క్రిష్ణన్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వీడియోను వెస్ట్రన్ కమాండ్ పీఆర్వో ట్వీట్ చేశారు.‘‘సైనికుడి అచంచలమైన స్ఫూర్తికి, ధైర్యానికి వందనాలు! ఇండియన్ ఆర్మీ.. ఎల్లప్పుడూ దేశ సేవలో!’’ అని రాసుకొచ్చారు.

Spread the love