అనాథ పిల్లల వెతల్ని తెలిపిన పాట

A song about orphansఈ లోకంలో ఎంతో మంది అనాథ పిల్లలున్నారు. తల్లిదండ్రులకు దూరమై, తినడానికి తిండి లేక, ఉండడానికి గూడు లేక, చదువుకొనే స్థితి లేక ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఆ కష్టాల్ని, వాళ్ళు పడే నరకయాతనను గురించి ఈ పాట తెలియజేస్తుంది. సినీగేయరచయిత్రి రాణి పులోమజాదేవి గారు రాసిన పాట ఇది. ఆ పాటనిపుడు చూద్దాం.

తెలుగు సినిమాల్లో గేయరచయిత్రులు చాలా తక్కువగా ఉన్నారు. కొంతమంది రచయిత్రులు అద్భుతమైన పాటలతో వెండితెరను వెలిగించారు. అలాంటి వారిలో రాణిపులోమజాదేవి గారొకరు. ఈమె అగ్రశ్రేణి రచయిత్రి. ఈ పాటలో అనాథ పిల్లల మనసుల్లోని ఆవేదనకు అక్షరరూపమిచ్చిన తీరు అత్యద్భుతం. 2012లో ఫణిరాజ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘శీనుగాడు’ సినిమాలోని ఆ పాటనిపుడు పరిశీలిద్దాం.
అలతి అలతి పదాల్లో పసిపిల్లల వెతల్ని హృదయవిదారకంగా ఆవిష్కరించారు రాణిపులోమజాదేవి. తల్లిదండ్రులు లేక అనాథలై కుమిలిపోతున్న ఇద్దరు పసివాళ్ళను గురించి చెబుతుందీపాట.
ఆ ఇద్దరు పసివాళ్ళు అన్నాచెల్లెళ్ళు. వారికి అమ్మానాన్న లేరు. నా అనే వాళ్ళు ఎవరూ లేరు. తోడుగా దగ్గర కూర్చొని, ప్రేమగా మాట్లాడే వాళ్ళు లేరు. వాళ్ళ కష్టసుఖాల్ని పంచుకునేవాళ్ళు, కనీసం వాళ్ళ మాటలు వినేవాళ్ళు కూడా లేరు. ఆ బాధను వాళ్ళ పసి హృదయం చెబుతున్న తీరు ఈ పాటలో కనిపిస్తుంది. మన మనసులను చెమ్మగిల్లేలా చేస్తుందీపాట.
తల్లి ఒడిని తొలి బడిగా చెబుతుంటాం. కాని మాకు ఊహ తెలిసినప్పటి నుంచి తల్లి ఒడి, తల్లి ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు. ఆ తల్లి ఒడిలో మేం పెరగలేదు. ఏ చదువూ నేర్వలేదు. అలాగే బుడిబుడి అడుగులు వేయించే తండ్రి ప్రేమకు నిలయం వంటి వాడు. దేవునికి ప్రతిరూపం నాన్న. అమ్మ మనకు జన్మనిస్తే, నాన్న ఈ ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు. అలాంటి దేవుడిని కూడా మేం కంటితో చూడలేదంటూ ఆ పసిపిల్లలు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.
తల్లిదండ్రులు లేనివారు లోకానికి చులకనగా కనబడతారు. వాళ్ళ బాధ ఈ లోకం పట్టించుకోదు. వాళ్ళను జాలిగా చూడదు సరికదా.. కనీసం మనుషులుగానైనా గుర్తించదు. ఓ బ్రహ్మా! మాకు ఇలాంటి రాత ఎందుకు రాశావయ్యా.. మా బాధ నీకు ఎలా తెలుస్తుంది?
అంబా అని లేగదూడ పిలిస్తే చాలు తల్లి గోవు పరుగెత్తుకువచ్చి తన బిడ్డను అక్కున చేర్చుకుని పాలిస్తుంది. తన ఆకలిని తీరుస్తుంది. గోముగా ముద్దాడుతుంది. అలాగే.. ఆకలితో పసిబిడ్డ ఏడ్వగానే తల్లి ఎత్తుకుని పాలిచ్చి బుజ్జగిస్తుంది. కాని మాకు ఆకలి అంటే అన్నం పెట్టేవాళ్ళు ఎవరు? ఓదార్చే వాళ్ళెవరు? ఇలాంటి జీవితాన్ని మాకు ఎందుకు ఇచ్చావు? అంటూ వాళ్ళు ఆ బ్రహ్మను ప్రశ్నిస్తున్నారు.
అమ్మ అనే పదం ప్రపంచంలోనే మధురమైన పదం. మహోన్నతమైన పదం. ఆ పదాన్ని, ఆ మాటని మాటగానే మిగిల్చావు కాని ఆ ప్రేమను మాకు అందేలా చేయలేదు. నాన్న అనే పిలుపు ఎంతో చల్లనైన పిలుపు. కారుణ్యం, అనురాగం కలగలసిన పిలుపు. అంత చల్లనైన పిలుపుని కలగానే మిగిల్చావు కాని ఆ ప్రేమను మాకు అందజేయలేదు. నాన్న నీడలో స్వేచ్ఛగా విహరించే అదృష్టాన్ని మాకివ్వలేదు. దిక్కులేని వారికి దేవుడే దిక్కంటారు. మరి మాకు నువ్వే దిక్కు.. మా బాధ అర్థం చేసుకో అని ఆ చెల్లి బాధపడుతుంటే ఆమెకు తోడుగా ఉన్న ఆ అన్న ఇలా ఓదారుస్తున్నాడు..
మనకు అమ్మానాన్న లేకపోవచ్చు. ఎవరూ చేయూతనివ్వకపోవచ్చు. అన్నాచెల్లెళ్ళుగా మనకు ఒకరికి ఒకరం తోడుగా ఉన్నాం. మనకు మనమే ధైర్యం. మనకు మనమే అండ దండ. ఏ తోడు లేక ఒంటరిగా బతికేవాళ్ళు ఈ సమాజంలో ఎంతోమంది ఉన్నారు. మరి వాళ్ళతో పోల్చి చూస్తే మనమే ఎంతో నయం చెల్లి.. అంటూ ఆ అన్న ఓదారుస్తున్నాడు. నువు బాధపడకు, నీకు నేను అమ్మగా ఉన్నాను.. అమ్మ ప్రేమను నీకు నేను పంచుతాను. నాన్నలా ఆడిస్తాను. పాడిస్తాను. బుజ్జగిస్తాను. వాళ్ళ లోటు లేకుండా నిన్ను కంటిపాపలా చూసుకుంటాను. నీకు ఇక దిగులు వద్దు చెల్లీ..అంటూ ఓదారుస్తాడు ఆ అన్న..
అనాథ పిల్లల జీవితాలు ఎంత దుర్భరమో వివరిస్తుందీ పాట. వాళ్ళ కష్టాన్ని కళ్ళకు కట్టేలా తెలియజేస్తుందీ పాట. అన్నా చెల్లెళ్ళ అనురాగాన్నీ వివరిస్తుందీపాట..

పాట:-
తల్లి ఒడి తొలి బడి అంటారు అందరూ/ ఆ చల్లని ఒడిలో చదువు మేము నోచలేదు/ బుడి బుడి అడుగులు నేర్పే తండ్రి ప్రేమ నెలవు/ ఆ దేవుని రూపాన్ని మేము చూడలేదు/ తలిదండ్రులు లేనివారు లోకానికి అలుసనా?/ అందరికి చులకనా?/ వారి మనసు ఏమిటో పట్టదు ఎవ్వరికైనా/ ఓ విధాతా! అమ్మా నాన్న ఉన్న నీకు ఏం తెలుసు ఈ బాధ/ ఓ విధాతా! జాలిలేక రాశావు?/ ఎందుకు మాకీ రాతా/ అంబా అను దూడకు పొదుగునిచ్చు తల్లి గోవూ/ అమ్మా అని పాప ఏడ్వ పాలిచ్చును తల్లి ఎపుడూ/ అమ్మ అనే మధురమైన మాటనిచ్చి నీవు/ అమ్మ ప్రేమను మాకు మాటనే చేశావు/ నాన్న అను చల్లనైన పిలుపునిచ్చి నీవు/ నాన్న నీడను మాకు కలగానే ఉంచావు/ దిక్కులేని వారికి దేవుడు దిక్కంటారు/ అన్నాచెల్లెల్లుగా ఒకరికొకరినిచ్చాడు/ ఒంటరి బ్రతుకులకన్నా మనమెంతో మిన్నా/ బాధపడకు నీకు నేను అమ్మగా ఉన్నా/ నాన్న నీడ నే నీకు దిగులొద్దు చెల్లీ/ తండ్రిగా నిన్ను నేను లాలిస్తాను తల్లీ..

– డా||తిరునగరి శరత్‌చంద్ర,
[email protected]
సినీ గేయరచయిత, 6309873682

Spread the love