గిరిజనుల బతుకులు కడగండ్ల మయమై, అస్తవ్యస్తమై దొరల అధికారానికి బలి అవుతున్న తీరును ఈ పాట చెబుతుంది. అడవి బిడ్డల బతుకులు అన్యాయమైపోతున్నాయి. వాళ్ళ బాధలు ఎవరికి చెప్పుకున్నా పట్టించుకోకపోవడంతో గతిలేక ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతుంటారు..ఆ కన్నీటి దశ్యాన్ని వివరిస్తూ ఈ పాట రాశారు మల్లావజల సదాశివుడు. 1994 లో ఆర్.నారాయణమూర్తి నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన ‘ఎర్రసైన్యం’ సినిమాలోని ఆ పాటనిపుడు పరిశీలిద్దాం.
మల్లావజల సదాశివుడు గొప్ప ప్రజాకవి. ఈటెల్లాంటి పాటలతో అన్యాయంపై విరుచుకుపడ్డ ఉద్యమ కవి. ఆయన ఎప్పుడో రాసిన పాటను సందర్భానుగుణంగా ‘ఎర్రసైన్యం’ సినిమా కోసం వాడుకున్నారు..
అడవి బిడ్డలను చులకనగా చూసే దొరలున్న ఊరు అది. అన్యాయంగా వారి భూములు లాక్కుని, వారికి కనీస అవసరాలను కూడా అందనివ్వక ఇబ్బందులు పెట్టిన వైఖరి ఇక్కడ కనబడుతుంది. అడవి సంపదను అక్రమంగా దోచుకునే బడాబాబులూ ఉన్నారు. వెట్టిచాకిరి చేయించుకుంటూ కనీస వేతనం కూడా ఇవ్వక అష్టకష్టాలు పెట్టే దుర్మార్గులూ ఉన్నారు.
చేసేదేమి లేక తమ ఊరిలో తమకు రోజులు గడవక వేరే ఊరికి వలస వెళ్ళడానికి అడవిబిడ్డలంతా సిద్ధమవుతారు. తన ఆడబిడ్డకు ఊరి కామందు చేసిన అన్యాయాన్ని తలచుకుంటూ అవమానంతో కథా నాయకుడు కుమిలిపోతున్న సందర్భం కూడా ఇక్కడ కనబడుతుంది.
అందుకే.. మన ఊరిలో మనం స్వేచ్ఛగా బతికేందుకు ఏమున్నది? ఏమున్నదక్కో.. అంటూ ఆవేదనతో గిరిజన నాయకుడు పాడే పాట ఇది.. మూట ముల్లె సర్దుకుని వెళ్ళిపోతున్నాను..తన ఊరిలో తనకిక ఏమి లేదని బాధపడుతుంటాడు. ఈ దొరలంతా ఎక్కడ నుండి వచ్చారో తెలియదు కాని నా భూమిపై కన్ను వేశారు. భూమిని కబ్జా చేశారు. నా చెల్లెలి బతుకును నాశనం చేశారు. గుండె నిండా దుఃఖాన్ని నింపారు..అలాంటి వీధి కుక్కల్లాంటి మనుషులున్న ఈ ఊరిలో నేనుండలేను.. అందుకే వెళ్ళిపోతున్నానంటాడు ఆ గిరిజన నాయకుడు.
కాళ్ళ వేళ్ళపడి మొక్కినా కనికరించని కసాయి లోకమిది. బతుకును లూటీ చేసి ఊరంతా నన్ను వెక్కిరిస్తూ చూస్తుంది. ఇక ఈ ఊరిలో నాకేం మిగిలిందంటూ కన్నీరు మున్నీరవుతాడు. అడవి తమకిచ్చిన సంపదను అమ్ముకుని పొట్ట పోసుకుని బతకవచ్చని షావుకారు దగ్గరకెళ్తే మాకు ఈతాకంతా సొమ్ము ఇచ్చి, అన్యాయంగా తాటాకంతా సొమ్ము వాడు కాజేశాడు. సబ్బు, పౌడరు వంటివి చూపి ఆశలు పెట్టాడు. రంగు రంగు డబ్బల బొమ్మలు చూపించి మోసం చేశాడు..చివరికి కొంప కూల్చాడు. ఉండడానికి నీడ లేకుండా చేశాడు..ఇక ఏమున్నదని నేను ఈ ఊరిలో ఉండాలంటాడు..
భూమిని సాగు చేయకుండా, నాట్లు వేయకుండా, అసలు వ్యవసాయమే చేయకుండా మేం కష్టపడితే ప్రభుత్వం పన్నులు విధించి కట్టడి చేస్తూ మా పొట్ట మీద కొడితే మేం ఎలా బతకాలి? ఆకలికి అలమటించి అలమటించి అడవిబిడ్డలకు ఒంట్లో శక్తి లేకుండా పోయింది. చెప్పలేనన్ని బాధలు నానా అవస్థలు పడినాం.
ఎందరెందరో నేతలు మారుతూ ఉన్నారు..కాని మా తలరాతలు మారడం లేదు. లోకాలను పాలించే దేవుడు మాకు మాత్రం శాపాలు పెట్టాడు. అందుకే ఇన్ని కష్టాలు.. అడవిబిడ్డలం మేము. అడవుల్లో ఎన్నో పులులతో సహవాసం చేసిన ధైర్యం మాది..కాని మానవ మగాలను మాత్రం గెలవలేకపోయాం.. మగాలకంటే ప్రమాదకరమైన మనుషులు ఊళ్ళోనే తిరుగుతున్నారు. ముందు వాళ్ళను గెలవాలి.. లేకుంటే నీతి బతకదంటూ గిరిజన నాయకుడు బాధతో పాడుతుంటాడు..
అడవిబిడ్డలు మగాలను గెలిచినా మానవమగాలను గెలవలేక అన్యాయమవుతున్నారన్న సత్యాన్ని పాటలో ఎంతో గొప్పగా పలికించారు సదాశివుడు.
ఈ పాటలో ఆయన వాడిన భాష ఎంతో అద్భుతంగా ఉంది. ‘పోడు’, ‘ఎగసం’, ‘పూచి పుల్ల’, ‘బుగత భూమి’, ‘కామోసు’, ‘ఈది కుక్కలు’, ‘బాంచెన్’, ‘అంగలార్చడం’ వంటి పదాలు యాసను పొదుగుకుని కనబడతాయి..
అడవిబిడ్డల కన్నీటి జీవితాలను కళ్ళ ముందుంచుతుం దీపాట..
పాట:-
ఏమున్నదక్కో ఏమున్నదక్కా ముల్లె సదురుకున్న ఎల్లిపోతా ఉన్న/ ఈ ఊర్లో నాకింక ఏమున్నదక్కో/ యాడ నుండి కన్ను ఏసెనో, సామి/ బుగత భూమి కబ్జా చేసెనో, సామి/ బిడ్డ బతుకు బుగ్గి చేసెనో, సామి/ గునపాలు గుండెల్లో దింపెనో, సామి/ కాళ్ళ ఏళ్ళ పడి మొక్కినా/ ఈది కుక్కలతోటి పోటి యరు /బతుకు లూటీ యరు ఊరు ఎక్కిరించే బాంచన్/ ఏమున్నదక్కో.. ఓ.. ఏమున్నదక్కో/ అడివి సంపద పట్టుకోని, సామి/ సావుకారు కొట్టుకెళ్తే, సామి/ ఈతాకు ఇచ్చిండు మాకు, సామి/ తాటాకు దొబ్బిండు వాడు, సామి/ సబ్బు పౌడరు మోజు పెట్టీ/ రంగు డబ్బల బొమ్మ జూపిండు/ కొరివి పెట్టిండు కొంప కూల్చిండు బాంచన్/ ఏమున్నదక్కో..ఓ..ఏమున్నదక్కో/ పోడు ఎగసం జెయ్యకుండా, సామి/ పూచి పుల్ల ముట్టకుండా, సామి/ కట్టడంటూ గవర్నమెంటు, సామి/ పొట్ట మీద కొట్టుతుంటే, సామి/ అడివిబిడ్డలమయ్యి ఉండీ/ ఆకలాకలంటు అర్చినం/ అంగలార్చినం బాధకోర్చినం బాంచన్/ ఏమున్నదక్కో.. ఓ..ఏమున్నదక్కో/ నేతలెందరో మారినా, సామి/ రాత గీత మారలేదులే, సామి/ లోకాలనేలేటి దేవుడు, సామి/ శాపాలు పెట్టేను కామోసు, సామి/ పులులు సింహాలను గెలిచినా/ మానవ మగమును గెలవకా/ ఎదురు నిలవకా ఓడిపోయినాం బాంచన్/ ఏమున్నదక్కో.. ఓ.. ఏమున్నదక్కో.
– డా||తిరునగరి శరత్‌చంద్ర,
[email protected]
సినీ గేయరచయిత, 6309873682