కాటేదాన్‌లో జంట హత్యల కలకలం

– బండరాయితో మోది ఇద్దరు వ్యక్తులను..
– దారుణంగా హత్య చేసిన దుండగులు
నవతెలంగాణ-రాజేంద్రనగర్‌
అర్థరాత్రి రోడ్డు పక్కన పడుకున్న ఇద్దరు వ్యక్తులను బండరాయితో మోది దారుణంగా హత్య చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుర్గానగర్‌ చౌరస్తా నుంచి కాటేదాన్‌ వెళ్లే మార్గంలో దుప్పట్లు అమ్ముకునే ఓ వ్యక్తి రోడ్డు పక్కన నిద్రపోతున్నాడు. అదేవిధంగా కాటేదాన్‌లోని ఒక షాప్‌ ఎదుట అర్ధరాత్రి మరో వ్యక్తి నిద్రపోతున్నాడు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు వీరిద్దరిని బండరాయితో మోది దారుణంగా హత్య చేశారు. ఉదయం స్థానికులు మృతదేహాలను చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లోస్‌ టీం, డాగ్‌ స్కాడ్‌తో క్షుణ్ణంగా ఆ ప్రాంతాన్ని తనిఖీ చేశారు. చనిపోయిన ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మరో వ్యక్తి ఎవరనేది తెలియాల్సి ఉంది. పోలీసులు సమీపంలోని సీసీ ఫుటేజ్‌ని పరిశీలించారు. ఈ హత్య అర్ధరాత్రి 2.30 గంటలకు జరిగిందని పోలీసులు నిర్ధారించారు. ఒకే వ్యక్తి ఈ హత్యలకు పాల్పడి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తు న్నారు. మద్యానికి బానిసై గంజాయి తాగి సైకో కిల్లర్‌గా మారిన వ్యక్తి ఈ హత్య చేసి ఉండవచ్చని పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. అయితే ఇదే రోజు నగరంలో జరిగిన జంట హత్య కేసులకు ఈ హత్యలకు ఏమైనా లింకు ఉందా అని పరిశీలిస్తున్నామని రాజేంద్రనగర్‌ ఏసీబీ గంగాధర్‌ తెలిపారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయన్నారు. ఈ మేరకు పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Spread the love