నవతెలంగాణ – హైదరాబాద్: ఓఆర్ఆర్ పరిధిలో చెరువుల ఆక్రమణలు గుర్తిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన హైదరాబాద్ లోని చెరువుల పరిరక్షణపై లేక్ ప్రొటెక్షన్ కమిటీతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా చెరువులకు పూర్వ వైభవం తెచ్చేందుకు చేపట్టాల్సిన చర్యలపై వారు చర్చించారు. అదేవిధంగా ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల గుర్తింపునకు చర్యలు చేపట్టనున్నారు. చెరువుల ఆక్రమణలకు అస్కారం లేకుండా ప్రత్యేకంగా ఓ యాప్‌ను తీసుకురావాలని నిర్ణయించారు. ఎక్కడ ఆక్రమణలు జరిగినా.. క్షణాల్లో ‘హైడ్రా’కు తెలిసేలా వ్యవస్థను రూపొందించనున్నారు. ఆక్రమణల తొలగింపు తరువాత వ్యర్థాలను పూర్తి స్థాయిలో తొలగించేలా చర్యలు చేపట్టనున్నారు. తొలిదశలో భాగంగా సున్నం చెరువు, అప్పా చెరువు, ఎర్రకుంట, కూకట్‌పల్లి నల్ల చెరువులో పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ.. ముఖ్యంగా ఓఆర్ఆర్ పరిధిలోని చెరువుల ఆక్రమణపై గుర్తిస్తామని తెలిపారు. శాస్త్రీయ పద్ధతుల ద్వారా చెరువుల పరిశీలనలో ఇతర రాష్ట్రాల్లో అవలంభిస్తున్న విధివిధానాలను అధ్యయనం చేస్తామని రంగనాథ్ స్పష్టం చేశారు.