రైతులను నిండా ముంచిన తుఫాను

రైతులను నిండా ముంచిన తుఫాను– ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలంటూ
– రైతుల డిమాండ్‌
నవతెలంగాణ-చండ్రుగొండ
ఇటీవల కురిసిన భారీ వర్షాలు రైతులకు కన్నీరు మిగిల్చాయి. వర్షాలతో వరద పంట పొలాల్లోకి చేరి నష్టం వాటిల్లడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో వరద నీరు పంట పొలాల్లోకి చేరడంతో వేర్లు కుళ్ళి పోయి పంట ఎండిపోతోంది. పత్తి చేను పూర్తిగా ఎరుపు రంగులోకి మారి మొక్కలు చనిపోతున్నాయి. ఈ సందర్భంగా రైతులు నాగరాజు, రామారావు తదితరులు మాట్లాడుతూ.. వర్షాలతో వేసిన పత్తి, మిర్చి పంటంతా వరదకు కొట్టుకుపోయిందన్నారు. కుళ్లిన మొక్కలను మందుల షాపులకు తీసుకువెళ్లి అడిగితే.. దీనికి ఎలాంటి మందులు లేవని చెబుతున్నారని వాపోయారు. ఎకరానికి సుమారు రూ.25 నుంచి 30 వేల పెట్టుబడి పెట్టామని, మిర్చి మొక్క నాటిన దగ్గర నుంచి వర్షాలు మొదలవడంతో తమ గోస ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది మిర్చి పంట రోగాల బారిన పడి దిగుబడి తక్కువ రావడంతో అప్పుల పాలయ్యామని, ఈ ఏడాదైనా దిగుబడి ఎక్కువగా వచ్చి అప్పులు తీరుతాయనుకుంటే.. తుఫాను నిండా ముంచిందని తెలిపారు. ప్రభుత్వం పత్తి, మిర్చి రైతులను ఆదుకోవాలని, ఎకరానికి నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు.

Spread the love