నవతెలంగాణ – ములుగు
కళాశాలలో తోటి విద్యార్థులు ర్యాగింగ్ చేశారని అవమానంగా భావించిన ఓ విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం తెల్లవారు జామున ములుగు జిల్లా, మంగపేట మండలం బుచ్చంపేటలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని బుచ్చంపేటకు చెందిన సారగాని సతీష్ (14) అనే విద్యార్ధి హన్మకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరాడు. కాళాశాలలోని సీనియర్ విద్యార్థులు సతీష్ ను కొంత కాలంగా ర్యాగింగ్ పేరుతో వేధిస్తున్నారని మండలంలో తనతో చదినిన విద్యార్థులకు చెప్పి నాలుగు రోజుల క్రితం హన్మకొండ నుండి వచ్చాడు. గ్రామంలోని తోటి స్నేహితులతో మంగపేట ప్రభుత్వ కాలేజీలో చేరుతానని ప్రిన్సిపాల్ తో మాట్లాడాలని తల్లిదండ్రులకును కోరాడు. అలాగే చేద్దామని వారు కుమారుడికి ధైర్యం చెప్పారు. కానీ, అప్పటికే ర్యాగింగ్ తో మనస్తాపం చెందిన సతీష్ ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఏటూరునాగారం సామాజిక ఆసుపత్రికి తరలించినట్టు గ్రామస్తులు తెలిపారు.