
— పరిస్థితి విషమం
— ప్రశ్నార్ధకంగా ఆత్మహత్యకు గల కారణలు
— 48 గంటలు గడిస్తేనే కానీ ఏమి చెప్పలేమంటున్న వైద్యులు
— విద్యార్థిని నోరు తెరిస్తే తప్ప బయటికి రాని నిజాలు
నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న రూపావత్ శిరీష (14) అనే విద్యార్థిని శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. పురుగుల మందు తాగిన విద్యార్థినిని చికిత్స నిమిత్తం నల్గొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకువచ్చి ఐసియూ లో చికిత్స అందిస్తున్నారు. మరో రెండు రోజులు గడిస్తే కానీ విద్యార్థి ని ఆరోగ్య పరిస్థితిపై స్పష్టమైన నిర్ణయం రాదని వైద్యం చెబుతున్నారు, ఈ ఘటనకు సంబంధించి బంధువులు తెలిపిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. దసరా సెలవులకు ఇంటికి వచ్చిన శిరీష ను తల్లిదండ్రులు సైదా, స్వాతి లు శుక్రవారం మధ్యాహ్నం వారి సొంత గ్రామమైన దామరచర్ల మండలం వీర్ల పాలెం నుండి మధ్యాహ్నం సుమారు 12:30 గంటల ప్రాంతంలో గురుకులంలో చేర్చారు. కాగా సాయంత్రం 6:30 గంటలకు తిరిగి గురుకులం నుండి గురుకుల పాఠశాల యాజమాన్యం వారు శిరీష కడుపునొప్పితో బాధపడుతుందని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిని తీసుకు వెళ్తున్నామని మీరు అక్కడికి రావాలని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. శిరీష కు మొదట మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో ప్రధమ చికిత్స అందించిన అనంతరం పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు సూచించడంతో నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతుంది. కాగా విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియడం లేదు. విద్యార్థిని తల్లిదండ్రులు గురుకుల పాఠశాలపై ఎలాంటి ఆరోపణలు చేయడం లేదు. విద్యార్థిని కూడా వైద్యులు, పోలీసులతో పాఠశాలలోని యాజమాన్యంతో గాని తల్లిదండ్రులతో గాని తనకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పింది.
భిన్నాభిప్రాయాలు…
ఈ సంఘటనపై భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. విద్యార్థిని, తల్లిదండ్రులు పాఠశాలపై ఎలాంటి ఆరోపణలు చేయడం లేదు. విద్యార్థిని ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకునే పాఠశాలకు వచ్చి ఉంటుంది అని భావిస్తున్నారు. గురుకులంలో క్రిమిసంహారక మందులు ఉండే అవకాశం లేదు. కాగా గురుకుల పాఠశాల యాజమాన్యం వారు ఇంటి నుండి క్రిమిసంహారక మందును తీసుకొచ్చిందని ఒకసారి, ఇంటి నుండి మందును తాగి వచ్చిందని మరొకసారి ఆరోపించడం గమనార్హం.
ప్రేమ వ్యవహారమే కారణమా..!
కాగా విద్యార్థిని ఓ యువకుడ్ని ప్రేమించినట్లు తెలుస్తోంది. గురుకుల పాఠశాలలో విద్యార్థిని నోటు పుస్తకంలో పాఠశాల యాజమాన్యానికి ఓ లెటర్ దొరికింది. దాని ప్రకారం ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. పాఠశాల యాజమాన్యం దగ్గర ఉన్న ఆ లెటర్ ను ఎవరికీ చూపించకుండా గోప్యంగా ఉంచారు.
గురుకుల పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం..?
సెలవుల్లోకి ఇంటికి వెళ్లిన విద్యార్థిని తిరిగి గురుకుల పాఠశాలకు వచ్చిన క్రమంలో పాఠశాలలోకి చేర్చుకునే ముందు
పాఠశాల సిబ్బంది విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడంతోపాటు బ్యాగును పూర్తిగా చెక్ చేసి అనంతరం లెటర్ రాయించుకొని పాఠశాలలోకి అనుమతిస్తారు. ఇక్కడ మాత్రం అవేమీ చేయకుండా పూర్తి నిర్లక్ష్యంతో విద్యార్థిని పాఠశాలల్లోకి అనుమతిచ్చారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్ల విద్యార్థిని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో ఉన్న గురుకులాల పరిస్థితి అంతా ఆగమ్య గోచరంగా ఉందని గురుకుల పాఠశాల పై ఉన్నత స్థాయి అధికారులు పర్యవేక్షణ చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొంటున్నారు.
ఎలాంటి వాసన రాలేదు..:రూపవత్ సైదా, స్వాతి (విద్యార్థిని తల్లిదండ్రులు)
గురుకుల పాఠశాలకు పంపి వచ్చేంతవరకు మా అమ్మాయి వద్ద ఎలాంటి పురుగుమందు వాసన రాలేదు. మేము ఇంటికి వచ్చాక మీ పాప ఆరోగ్యం బాగాలేదు అని పాఠశాల యాజమాన్యం చెప్పారు. వెంటనే బయలుదేరి వెళ్ళాం. మా అమ్మాయిని అడగగా మొదటగా నాన్నమ్మ ఇంట్లో మందు తాగాను అని, తరువాత మళ్ళీ పాఠశాల లోనే పురుగుల మందు తాగాను అని చెప్పింది.
విద్యార్థిని నానమ్మ ఇంటి వద్ద పురుగుల మందు తాగి ఉండొచ్చు…
– ఆగస్టన్ (ఎస్టి గురుకుల పాఠశాల ఆర్సిఓ), సరిత (గురుకుల పాఠశాల ప్రిన్సిపల్)
విద్యార్థిని కళ్ళు తిరుగుతున్నాయని, కడుపునొప్పి తో బాధపడుతున్నానని సిబ్బందితో తెలిపింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అక్కడ వున్న స్టాఫ్ నర్స్ ని పిలిచి చూపించారు. విద్యార్థిని నాన్నమ్మ ఇంటి వద్ద పురుగుల మందు త్రాగి పాఠశాలకు వచ్చినట్లు చెప్పింది.