అన్ని విషయాలలో వివాదాస్పదమవుతున్న ప్రస్థుత కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవ విషయంలోనూ విమర్శలకు గురైంది. ముఖ్యమైన ప్రతిపక్ష పార్టీలన్నీ ఆ కార్యక్రమాన్ని బహిష్కరించాయి. పరువు కాపాడుకునే ప్రయత్నంలో కేంద్ర హౌమ్‌మంత్రి విలేకరులకు సింగోల్ విషయం వెల్లడించారు. ఎవరికీ తెలియని ఒక అప్రధానమైన సింగోల్‌ను ఎందుకు తెరమీదికి తెచ్చారూ? అంటే… నూతన పార్లమెంటు ప్రారంభోత్సవ వివాదాన్ని కప్పిపుచ్చుకోవడానికి! నూతన పార్లమెంటు భవనానికి ప్రధాని శంఖుస్థాపన చేసినప్పుడే దేశం భగ్గుమంది. అశోక చక్రంపై నిర్మించిన కొత్త సింహాలు రౌద్రంగా ఉన్నాయన్న విమర్శలొచ్చాయి. ఇప్పుడు మళ్ళీ ఆ భవన ప్రారంభోత్సవం కూడా ఆయనే చేయడం వల్ల విపక్షాలే కాదు, దేశ ప్రజలు సైతం కినుక వహించారు. ఎందుకంటే పార్లమెంటు వ్యవస్థలో మొదటిస్థానం దేశాధ్యక్షులది. తర్వాత రాజ్యసభది. ఆ తర్వాత లోక్‌సభది. ఆ వరుసక్రమంలో లోక్‌సభ నాయకుడిగా ప్రధానిది మూడోస్థానం. మొదటివారిని వదిలేసి, మూడోస్థానంలో ఉన్నవారు ప్రారంభించడం ఏమిటని విపక్షాలు నిరసన తెలియజేశాయి. మొత్తానికి మొత్తంగా కార్యక్రమాన్నే బహిష్కరించాయి.
దేశాధ్యక్షులంటే సుప్రీం కమాండర్ ఆఫ్ ద ఆర్మ్‌డ్ ఫోర్సెస్ – సైన్యాధినేత ఎవరో వారే దేశాధినేత అవుతారు. పార్లమెంటులో ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగించేది కూడా దేశాధ్యక్షులే. ఇక్కడ లింగభేదం ఉండదు. అధ్యక్ష స్థానంలో ఉన్నది గిరిజన మహిళనా? భర్తలేని మహిళనా అని చూడగూడదు. మత మౌఢ్య వ్యవస్థలో మాత్రమే అధ్యక్షులవారిది ఏ కులం? ఏమతం? భర్త లేదా భార్య జీవించి ఉన్నారా లేదా – అనేవి చూసుకుంటారేమోగానీ, ప్రజాస్వామ్య వ్యవస్థలో వాటిని పక్కన పెట్టాల్సిందే! భారత రాజ్యాంగ స్థానంలో మనువాదాన్ని ప్రతిష్టించాలని కలలు కంటున్న ఆరెస్సెస్-బీజేపీ వారి విధానాలు ఈ విధంగా అస్తవ్యస్తంగానే ఉంటాయి. మనువాదులు ఏర్పరిచిన నిచ్చెనమెట్ల కుల సంస్కృతి ప్రకారం ప్రస్థుత ప్రధాని అగ్రవర్ణంవాడు కాదు. పూజలకు అతను ఎలా పనికొచ్చాడూ? పైగా హిందూ ధర్మం ప్రకారం ఏ పూజలైనా సతీసమేతంగా చేయాలి. మరి ఈ ప్రధాని అలా చేయలేదు కదా? వారి ధర్మం ప్రకారం ఒంటిగా చేసిన పూజలు, సాష్టాంగ ప్రమాణాలు అన్నీ మంచి ఫలితాలనిస్తాయా? ఇవి సామాన్యుల అనుమానాలు…
మనది ప్రజాస్వామ్య దేశం గనుక, అన్ని మతాలకూ సమానమైన విలువ నివ్వాలి. అలాంటప్పుడు ఏ ఒక్క మతానుసారం హౌమాలు, పూజలు ఎలా నిర్వహిస్తారూ? ఛార్టెడ్ ప్లేన్ పంపి తమిళనాడులోని ఆధీనం మఠానికి చెందిన సాధువులను ఢిల్లీకి పిలిపించుకున్నారు కదా? మరి ఇతర మతాల ప్రతినిధుల్ని నామమాత్రంగానైనా పిలవలేదే? అసలైతే ప్రజాస్వామ్య వ్యవస్థలో మతాల్ని మత సంబంధమైన పూజాకార్యక్రమాల్ని పక్కనపెట్టి, వాటికి అతీతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఆ విషయాన్ని అతిక్రమించింది. సింగోల్ అంటే రాజదండం అనీ, అది తన చేతికి వచ్చింది గనుక, తనకు పట్టాభిషేకం జరిగిందనీ… ఇక అధికారమంతా తనదే అని ప్రధాని భావిస్తూ ఉండొచ్చు. ఒకప్పుడు నెహ్రూ చేతిలో ఉన్న రాజదండం ఈ రోజు తన చేతిలో కొచ్చిందని సంబరపడుతూ ఉండొచ్చు. అసలు విషయమేమంటే, ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజదండానికి గానీ, రాచరికానికి గాని ఎలాంటి విలువా లేదు… ఉండదు! చాలా శ్రద్ధగా గమనించాల్సిన విషయం ఒకటుంది. అలహాబాదు మ్యూజియంలో అప్పుడు పనిచేసిన క్యురేటర్ ఓంకార్ ఆనందరావు వాంఖ్‌డే చెప్పిన దాని ప్రకారం అది ”పండిట్ జవహర్‌లాల్ నెహ్రూకు బహుమతిగా వచ్చిన ఒక బంగారు చేతికర్ర” మాత్రమే. నెహ్రూ తన వస్తువుల్ని మ్యూజియంకు బహూకరించినప్పటి నుండి అంటే 1952 నుండి అది అక్కడే అలహాబాదు మ్యూజియంలో ఉంది. ఇప్పుడు అక్కడ ఉన్నది ఆధీనం మఠంవారిచ్చిన సింగోల్‌కు ప్రతిరూపం. ఒరిజనల్ సింగోల్, ఢిల్లీ నేషనల్ మ్యూజియంలో ఉంది. నెహ్రూజీ దాన్ని తన స్వంత ఆస్తిగా దాచుకున్నాడని అధికార పార్టీవారు చెప్పడం అబద్దం. ఎందుకంటే ఆ ఒరిజినల్ సింగోల్‌నే ఢిల్లీ నేషనల్ మ్యూజియం నుండి తెప్పించి మోడీగారు పూజలు చేసి కొత్త పార్లమెంట్‌లో ప్రతిష్టించారు.
ఏది ఏమైనా ప్రొఫెసర్ మాధవన్ కె. పలట్ చెప్పిన విషయం ఈ దేశ ప్రజలు నమ్మితీరాలి. ఆయన చరిత్ర పరిశోధకుడు మాత్రమే కాక, ఎన్నిక చేసిన నెహ్రూ రచనలకు (సెలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ జవహర్‌లాల్ నెహ్రూ) సంపాదకుడు. అంతే కాదు, నెహ్రూ మెమోరియల్ ఫండ్‌కు ట్రస్టీ కూడా! ”సింగోల్ మౌంట్ బాటిన్‌కు అందించి, మళ్ళీ తీసుకొచ్చి నెహ్రూకు ఇచ్చారనడం శుద్ధ అబద్ధం! అందుకు ఏ ఆధారమూ లేదు” అని ప్రొఫెసర్ మాధవన్ కె. పలట్ కొట్టిపడేశారు. ఇవన్నీ కేంద్ర గృహమంత్రిత్వశాఖ అల్లిన తప్పుడు కథలని ఆయన కరన్ థావర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తేల్చిచెప్పారు. అలహాబాదులోని ఆనందనిలయం నెహ్రూ కుటుంబీకుల స్వంత ఆస్తి. కాలక్రమంలో అది మ్యూజియం అయ్యింది. నెహ్రూ వస్తువులు, వచ్చిన బహుమతులు అన్నీ అందులో భద్రపరిచారు. ఇందిరాగాంధీ వచ్చాక ఆనందనిలయాన్ని జాతికి అంకితం చేశారు. అప్పటినుండి అది పబ్లిక్ ప్రాపర్టీ అయ్యింది. నేటి ప్రభుత్వ పెద్దలు నెహ్రూ విలువను తగ్గించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నట్టే… ఈ విషయంలో కూడా చేశారు. నెహ్రూ కావాలని తన ఆధీనంలో ఉంచుకున్నాడనీ, తన చేతికర్ర అని చెప్పుకున్నాడనీ అభాండాలు వేస్తున్నారు.
అధికార మార్పిడికి చిహ్నంగా సింగోల్‌ను నెహ్రూ స్వీకరించలేదు. అధికార మార్పిడి అంటే బ్రిటిష్ రాజు ఛార్లెస్-6 నుండి నాటి తొలి భారత రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్‌ల మధ్య జరగాలి. కానీ జరగలేదు. ప్రజాస్వామ్యంలో దేశాధ్యక్షుడే దేశానికి అధిపతి. ప్రధాని కాదు. అది నెహ్రూ సమయంలోనైనా లేక ఇప్పుడు మోడీ సమయంలోనైనా పద్ధతి పద్ధతే. అలా జరగనప్పుడు దానికి ఏ విలువూ ఉండదు. కాంగ్రెస్ నుండి తాము అధికారం హస్తగతం చేసుకున్నామని ఆరెస్సెస్ – బీజేపీలు సంబరాలు చేసుకుంటే చేసుకోవచ్చు. నూతన పార్లమెంట్ భవనంలో హౌమాలు, పూజలు, సాష్టాంగ ప్రమాణాలూ చేసి మనువాదం పట్ల తమ భక్తి ప్రపత్తులు చాటుకుంటే చాటుకోవచ్చు. అవన్నీ ఈ దేశ ప్రజల దృష్టిలో అప్రజాస్వామికమైనవి. రాజ్యాంగానికి విరుద్దంగా ఒక మతానికి సంబంధించిన కార్యక్రమాలు జరిపించడం అసలు ఎవరూ హర్షించరు.
తిరువదుతిరై అధీనం మఠంవారు 14 ఆగస్టు 1947న నెహ్రూజీకి సింగోల్ బహుకరించినప్పుడు ఇందిరాగాంధీ, పద్మజానాయుడు ఇద్దరూ అక్కడే ఉన్నారు. ఒకవేళ అది అధికార మార్పిడికి చిహ్నం – అని అనుకుని ఉంటే, వారు ఎన్నో చోట్ల, ఎన్నోసార్లు దాని గురించి మాట్లాడేవారు, రాసేవారు. వారు ఆ పని చేయలేదు. చరిత్రకారులెవరూ ఆ సంఘటనకు ప్రాధాన్యమివ్వలేదు. అదీగాక సి. రాజగోపాలాచారి (రాజాజీ) మనుమడు రాజమోహన్‌గాంధీ ఎప్పుడూ ఎక్కడా సింగోల్ గురించి రాయలేదు. ఎందుకంటే ఆయన రాజాజీ మనుమడు మాత్రమే కాదు. ప్రసిద్ధ చరిత్ర కారుడు. అంత ప్రాముఖ్యమున్న విషయమైతే ఆయన ఆ విషయాన్ని ఎందుకు వదిలేస్తారూ? గోపాల్‌కృష్ణ గాంధీ అయితే అసలు ఆ విషయమే తనకు తెలియదన్నాడు. ఈ సోదరులు పార్లమెంట్ వ్యవస్థలో ఉన్నవారు. ఇటు రాజాజీ అటు గాంధీజీ కుటుంబాలకు చెందినవారు. వారెందుకు అధికార మార్పిడికి చిహ్నం అయిన సింగోల్ ప్రసిక్తి ఎక్కడా తీసుకురాలేదూ? అంటే ఇది నేటి కేంద్ర హౌమ్ మినిష్టర్ వండి వార్చిన అబద్దాల వంటకం అని తేలిపోయింది. ఈ వాస్తవాలన్నీ తెలిశాక కేంద్ర గృహమంత్రి మాటల్లో నిజమెంతో తేటతెల్లమయ్యింది.
1. అలహాబాదు మ్యూజియంలో ఉన్నది ఒరిజనల్ సింగోల్ కాదు. దాని ప్రతిరూపం మాత్రమే! ఒరిజినల్ సింగోల్ ఢిల్లీ నేషనల్ మ్యూజియంలో ఉంది. దాన్ని నెహ్రూ తన స్వంత ఆస్తిగా దాచిపెట్టుకోలేదు.
2. అది తన బంగారు చేతికర్ర అని ఎప్పుడూ ఎక్కడా చెప్పుకోలేదు.
3. అధికార మార్పిడి జరిగినప్పుడు స్వీకరించింది అని చెప్పడానికి వీలేలేదు. నెహ్రూజీకి అందిన ఎన్నో బహుమతులలో ఇది ఒకటి!
4. ఇప్పుడు అధికారం ఎవరి నుండి ఎవరికి మారిందనీ? బీజేపీ-మోడీ ప్రభుత్వం గత తొమ్మిదేండ్లుగా అధికారంలోనే ఉంది. ఇదంతా వృధా ప్రయాస.
5. పెరిగిన ధరలు, నిరుద్యోగం, బ్యాంకు దోపిడీ గాళ్ళు, ప్రయివేటుకు పెద్దపీట, మహిళా రెజిలర్ల లైంగిక హింస, పతనమైన రూపాయి విలువ, ఆకలిసూచి, కనీవినీ ఎరుగని రైలు ప్రమాదాలు వంటి ఎన్నెన్నో అంశాల నుండి దేశ ప్రజల దృష్టి మరల్చడానికి – మ్యూజియంలో ఓ మూలపడి ఉన్న వస్తువును తెచ్చి ఈ ప్రభుత్వ పెద్దలు సంచలన వ్యాఖ్యలు చేశారన్నమాట.
6. గత ప్రభుత్వం ఏం చేసిందని మాటి మాటికి ప్రశ్నించే ఈ దేశ ప్రధాని ఇదిగో ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసి చూపుతున్నారు.
ఆగస్టు 14, 1947 సాయంత్రం, గవర్నర్ జనరల్, చివరి వైస్రారు అయిన మౌంట్ బాటెన్ – కరాచి నుండి ఢిల్లీ పాలం విమానాశ్రయంలో దిగాడు. ఆయన అప్పుడే పాకిస్థాన్ నుండి తిరిగివచ్చాడు. ఎందుకంటే, ఆ దేశానికి కూడా స్వాతంత్య్రం వచ్చింది ఆరోజే. మళ్ళీ ఆ రోజు రాత్రి ఢిల్లీ పార్లమెంటులో ఉండాలి. అక్కడ రాత్రి 11.30కు నెహ్రూజీ తొలిసారి ప్రసంగించబోతున్నారు. అంతటి ముఖ్యమైన కార్యక్రమాలమధ్య ఆధీనం మఠం వారు మౌంట్ బాటెన్‌ను కలిసి సింగోల్ ఇచ్చారనడం వందశాతం అబద్దం. వైస్రారు అంటే మామూలు విషయం కాదు. ఏ నిముషానికి ఎవరు వచ్చి వెళ్ళారన్నది అంతా రికార్డు ఉంటుంది. ఆ సాయంత్రం తమిళనాడు మఠాధిపతులు మౌంట్ బాటెన్ దగ్గరికి వచ్చిన రికార్డేది లేదు. అదంతా ఇప్పటి ఈ గృహమంత్రి సృష్టించిన రికార్డు! అంతా గమనిస్తే, మరొక విషయం తోస్తుంది. అబద్దాలతోనైనా… ఏదో విధంగా తమిళనాడులో నేటి స్టాలిన్ ప్రభుత్వాన్ని కదిలించాలన్న పథకాలు సిద్ధమవుతున్నాయేమో!
చివరగా ఇంకా ఒక ఆధారం ఉంది. డొమినిక్యు లిపిరి; లార్రి కొల్లిన్స్‌లు కలిసి ఇండియన్ ఇండిపెండెన్స్ మీద ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్’ అనే ఒక పెద్ద గ్రంథం రచించారు. అందులో అసలు సింగోల్ ప్రసక్తే లేదు. అధికార మార్పిడికి సింగోల్ చిహ్నమైతే,ఆ రచయితలు దాని గురించి తప్పక రాసి ఉండేవారు కదా? 10-12 శతాబ్దాల నాటి చోళ రాజుల సింగోల్‌ను తవ్వితీసి ఈ 21వ శతాబ్దానికి తీసుకొచ్చారంటే ఏమనుకోవాలి? ఈ సింగోల్ – నేటి ప్రజాస్వామ్య వ్యవస్థ మీద ఒక ‘సర్జికల్ స్ట్రైక్’ అని అనుకోవాల్సి ఉంటుంది.
– వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడెమీ
అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త.
– డాక్టర్ దేవరాజు మహారాజు