బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం

In Bengal A terrible train accident– ‘కాంచనజంగ’ను ఢీకొన్న గూడ్స్‌ రైలు
– లోకో పైలట్‌ సహా 15 మంది మృతి
– 60 మందికి గాయాలు
– సిగల్‌ జంపింగే కారణమంటున్న అధికారులు
– రైల్వే మంత్రి రాజీనామాకు కాంగ్రెస్‌ డిమాండ్‌
– కొనసాగుతున్న సహాయక చర్యలు
సిగల్‌ జంప్‌ కారణంగా ప్రమాదం జరిగిందని రైల్వే బోర్డు సీఈఓ జయ వర్మ సిన్హా తెలిపారు. కాగా నిర్వహణా లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని కాంగ్రెస్‌ విమర్శించింది. దీనికి బాధ్యత వహించి రైల్వే మంత్రి రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ నేత ప్రమోద్‌ తివారీ డిమాండ్‌ చేశారు. ‘నిర్వహణా లోపం కారణంగానే రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాక్‌లపై ఒత్తిడి పెరుగుతోంది. భద్రతా చర్యలు చేపట్టడం లేదు. ఒడిషా రైలు ప్రమాదం నుండి ప్రజలు తేరుకోకముందే ఈ ప్రమాదం చోటుచేసుకుంది’ అని ఆయన తెలిపారు.
కొల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌ జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో పదిహేను మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మంది గాయపడ్డారు. అసోంలోని సిల్చార్‌ నుండి కొల్‌కతాలోని సెల్దాకు వెళుతున్న కాంచనజంగ ఎక్స్‌ప్రెస్‌ను న్యూ జల్పాయిగురి స్టేషన్‌కు 11 కిలోమీటర్ల దూరంలో ఓ గూడ్సు రైలు వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ఘటనలో గూడ్సు రైలు బోగీలు చెల్లాచెదురు కాగా ఎక్స్‌ప్రెస్‌ రైలుకు చెందిన మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఉదయం సుమారు తొమ్మిది గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చునని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికులను కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ సంస్థల సిబ్బంది కృషి చేస్తున్నారు. ఎక్స్‌ప్రెస్‌ రైలు బోగీల్లో ఒకటి గాలిలో వేలాడుతూ కన్పిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.5 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున అందజేస్తారు.
ఎక్స్‌ప్రెస్‌ రైలు న్యూ జల్పాయిగురి స్టేషన్‌ నుండి బయలుదేరిన కొద్దిసేపటికే దానిని రంగపాని స్టేషన్‌ సమీపంలో వెనుక నుండి గూడ్సు రైలు బలంగా ఢకొీంది. దీంతో గూడ్సు రైలు బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఎక్స్‌ప్రెస్‌కు చెందిన మూడు బోగీలు పట్టాలు తప్పాయి.
రెడ్‌ సిగల్‌ వేసినా గూడ్సు రైలు లోకో పైలట్‌ పట్టించుకోకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారిలో గూడ్సు రైలు లోకో పైలట్‌, అసిస్టెంట్‌ లోకో పైలట్‌, ఎక్స్‌ప్రెస్‌ రైలు గార్డు కూడా ఉన్నారు. ప్రమాదం నేపథ్యంలో న్యూ జల్పాయిగురి, సిలిగురి జంక్షన్‌, బగ్‌డోగ్రా, అలువాబరి మార్గాల్లో ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేశారు. ప్రమాదం కారణంగా ఆ మార్గంలో అనేక రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఉత్తర బెంగాల్‌, దేశంలోని ఈశాన్య ప్రాంతాల నుండి దూర ప్రాంతాలకు నడిచే రైళ్ల రాకపోకలపై కూడా ప్రభావం పడింది. రైలు ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మరోవైపు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఘటనా స్థలానికి చేరుకొని సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. అధికారులు, వైద్యులు, అంబులెన్సులు, విపత్తు నిర్వహణ బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయ కార్యక్రమాల్లో నిమగమయ్యాయి. ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.
అంతా క్షణాల్లో జరిగిపోయింది
ప్రమాదం జరిగిన సమయంలో ఏం జరిగిందో అర్థం కాలేదని ప్రయాణికులు తెలిపారు. తాను బీ-1 బోగీలో ఉన్నానని, అకస్మాత్తుగా రైలు ప్రమాదానికి గురైందని, తనకు తలపై పెద్ద గాయమైందని, కిందికి దిగి చూస్తే వెనుక నుండి గూడ్సు రైలు ఢీకొట్టినట్లు అర్ధమైందని ఓ ప్రయాణికుడు చెప్పాడు.

Spread the love